మృతదేహంతో రాస్తారోకో..
దండేపల్లి, జనంసాక్షి మార్చి 21 ప్రేమోన్మాదానికి బలైన ఎంబడి సాయిష్మ కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ మృతురాలు కుటుంబ సభ్యులు, బందువులు మ్యాదరిపేట గ్రామంలో రాస్తారోకో నిర్వహించారు. ముందుగా లక్సెట్టిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో శవపంచనామ నిర్వహించిన అనంతరం మృతురాలు స్వగ్రామమైన కొత్త మామిడిపెల్లికి మృతదేహాన్ని తరలిస్తుండగా అప్పటికే మృతురాలు బందువులు, గ్రామస్థులు భారీగా చేరుకొని అంబులెన్స్ నుండి మృతదేహాన్ని కిందికి దించి నిందితునితో పాటుగా మరో నలుగురిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న లక్సెట్టిపేట సిఐ క్రిష్ణారెడ్డి సిబ్బందితో వచ్చి మృతురాలు కుటుంబ సభ్యులకు నచ్చజెప్పిన వినకపోవడంతో దండేపల్లి, లక్సెట్టిపేట ఎస్సైలు మచ్చ సాంబమూర్తి, లక్ష్మణ్ సిబ్బందితో ఎలాంటి గొడవలు జరగకుండా చూశారు. మృతురాలు తల్లి తన కూతురుకు న్యాయం చేయాలని ఎస్సై సాంబమూర్తి కాలుపట్టుకొని వేడుకున్నారు. నిందితునితో పాటుగా ఈ కేసులో ఉన్న వారిపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని సిఐ హామి ఇవ్వడం తో శాంతించిన కుటుంబ సభ్యులు, బందువులు ఆందోళన విరమించారు.