యంత్రాల ద్వారా విత్తనాలు నాటండి

కరీంనగర్‌, జూలై 7 : జిల్లాలోని రైతులు కూలీల అవసరం లేకుండా మొలకెత్తిన వరి విత్తనాలను నేరుగా విత్తుకొనేందుకు డ్రమ్‌సిడర్‌ వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్‌ స్మితాసబర్వాల్‌ శనివారం నాడు ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుత పరిస్థితులలో వ్యవసాయంలో కూలీల కొరత ఉండటం, అందుబాటులో లేకపోవడం వలన వ్యవసాయ పనులకు ఆటంకం ఏర్పడటం జరుగుతోందని, మంచి వర్షాలు పడతాయనుకొని రైతులు ముందుగా నార్లు పోసుకొని, సకాలంలో వర్షాలు పడక బోర్లలో, బావులలో సరైన నీరు లేక పోలం తయారీ ఆలస్యం అవటం, సమయానికి నాట్లు వేయకపోవటం ఫలితంగా దిగుబడులు తగ్గటం జరుగుతుందని వివరించారు. ఈ సమస్యలను అధిగమించడానికి, నీరు అందుబాటులో ఉన్నప్పుడు సమయం వృధా కాకుండా, నారుమడి లేకుండా నేరుగా వరి పంట పండిచుకొనేందుకు డ్రమ్‌సీడర్‌ ద్వారా నేరుగా వరి విత్తడం అనే పద్తితతి చాలా అనుకూలమైందని తెలిపారు. ఈ పద్దతిలో కూలీల అవసరం లేకుండా రైతు, అతని కుటుంబ సభ్యులు కలిసి మొలకెత్తిన వరి విత్తనాలను నేరుగా విత్తుకోవచ్చునని పేర్కొన్నారు. ఇందుకు గాను 500 డ్రమ్‌సీడర్‌ యూనిట్లు మంజూరు చేయాలని నిర్ణయించామని, ప్రస్తుతం 100 యూనిట్లు సిద్ధంగా ఉన్నాయని, ఒక యూనిట్‌ ధర 500 రూపాయలు కాగా, ఇందులో 50 శాతం అనగా 2500 రూపాయల సబ్సిడీ ఉంటుందని అంటే కేవలం రైతు 2500 రూపాయలు భరిస్తే సరిపోతుందని తెలిపారు. కావాల్సిన రైతులు సమీప వ్యవసాయాధికారి కార్యాలయంలో సంప్రదించాలని, వివరాలు పొందవచ్చునని సూచించారు.