యూపీలో తుపాకీ రాజ్యం
` 8 ఏళ్లు.. 15వేల ఎన్‌కౌంటర్లు
` హతులందరూ ఒకే వర్గానికి చెందినవారు
` ప్రత్యర్థులంతా ఒకే వర్గానికి, ప్రత్యర్థి వర్గానికి చెందినవారు
` సీఎం ఆదేశాల మేరకు అణిచివేస్తున్నట్టు వెల్లడిస్తున్న పోలీసులు
` గతం నుంచీ తప్పుబట్టిన సుప్రీం కోర్టు, ఎన్‌హెచ్‌ఆర్‌సీ
` ఎన్‌కౌంటర్ విధానాలను బేషరతుగా ఆపివేయాలని సర్వత్రా డిమాండ్లు
` ఇవి రాజకీయ హత్యలే అంటున్న ప్రతిపక్షాలు
లక్నో (జనంసాక్షి) : బూటకపు ఎన్‌కౌంటర్లు జరుపుతున్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ సర్కారు మారణహోమాన్ని సృష్టిస్తున్నట్టు తెలుస్తోంది. ఎన్‌కౌంటర్లు చేసిన తీరు, ఆ తరహా చర్యలపైనా ఎన్నో ప్రశ్నలు, విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చంపబడ్డవారు ఒక వర్గానికి చెందినవారని తెలుస్తుండగా.. ప్రత్యర్థులంతా కూడా ఒకే వర్గానికి, ప్రత్యర్థివర్గం వారుగా బహిర్గతమవుతుండగా గమనార్హం. యోగి ఎన్‌కౌంటర్ విధానాలపై ఇప్పటికే జ్యూడీషియల్ కమిషన్ సైతం ఏర్పాటుకాగా, న్యాయస్థానాలూ, పౌరహక్కుల సంఘాలూ సర్కారు తీరును తప్పుబట్టాయి. అయినప్పటికీ గత ఎనిమిదేళ్ల కాలంలో 15వేల ఎన్‌కౌంటర్లు నమోదు చేసిన ఉత్తరప్రదేశ్‌లోని బీజేపీ సర్కారు.. తమకు నచ్చని ఒకవర్గానికి చెందినవారినే లక్ష్యంగా చేసుకున్నట్టు తెలుస్తోంది.
ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఎన్‌కౌంటర్ విధానాలు కొనసాగిస్తున్నారు. 2017 నుంచి ఇప్పటివరకు 15వేల ఎన్ కౌంటర్ ఘటనలు నమోదైనట్లు తాజాగా యూపీ పోలీసులు వెల్లడిరచడం పరిస్థితి తీవ్రతకు అద్దంపడుతోంది. ఈ క్రమంలో దాదాపు 30 వేలమందికి పైగా నిందితులను అరెస్టు చేశారు. పోలీసులపై దాడియత్నం చేశారనే పేరిట జరిపిన ఎన్‌కౌంటర్లలో 9వేల మంది కాళ్లకు తుపాకీ గాయాలయ్యాయి. పరారీలో ఉన్నవారు, తరచూ నేరాలకు పాల్పడుతున్నారనే వారిని పట్టుకునేందుకు జరిపిన ఆపరేషన్లలో 238 మంది చనిపోయారు. అయితే సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆదేశాల మేరకే నేరస్తులను పట్టుకునేందుకు ఉక్కుపాదం మోపుతున్నట్టు డీజీపీ రాజీవ్ కృష్ణ వెల్లడిరచారు. గడిచిన ఎనిమిదేళ్లలో 14,973 ఆపరేషన్లు చేపట్టి 30,694 మంది నేరస్థులను అరెస్టు చేశామని, ఇందులో పోలీసులపై దాడులకు పాల్పడిన 9467 మంది కాళ్లకు తూటా గాయాలయ్యాయని తెలిపారు. ఈ ఎన్కౌంటర్లలో మొత్తంగా 238 మంది చనిపోయారని డీజీపీ రాజీవ్ కృష్ణ తెలిపారు. రాష్ట్రంలో ఎన్‌కౌంటర్ల సంస్కృతి, బుల్ డోజర్ల సంస్కృతి పెరిగిపోయిందని, సుప్రీంకోర్టు ఇటీవలే తీవ్ర విమర్శలు చేయగా తాజాగా ఈ వివరాలు వెల్లడిరచడం, తప్పు తమది కాదని పరోక్షంగా చెప్పడం గమనార్హం.
స్పందించిన సుప్రీం కోర్టు..!
మేరర్ జోన్లో అత్యధికంగా ఎన్‌కౌంటర్లు చోటుచేసుకోగా.. 7969 మంది నేరస్థులను అరెస్టు చేశామని డీజీపి తెలిపారు. అందులో ఆగ్రా జోన్లో 5529 మంది, బరేలీ జోన్లో 4383, వారణాసిలో 2029 మంది నేరస్థులను అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు. గౌతమబుద్ధ నగర్ కమిషనరేట్ పరిధిలో అత్యధికంగా 1983 మంది నేరస్థులను అరెస్టు చేయగా 1180 మందికి గాయాలయ్యాయి. ఘాజియాబాద్‌లో 1133 మందిని అరెస్టు చేశామని డీజీపీ తెలిపారు. అయితే తరచూ ఎన్‌కౌంటర్లపై సుప్రీం కోర్టు, ఎన్‌హెచ్‌ఆర్‌సీ అభ్యంతరాలు వ్యక్తం చేయడం గమనార్హం. ‘నేరస్థులను చంపుకుంటూపోవడం అంటే, శాంతి భద్రతలను కాపాడినట్టా? పోలీసులకు ఇక, రూల్స్ ఎందుకు? లాఠీలు ఎందుకు? విచారణలు ఎందుకు? తుపాకీలు ఇచ్చేస్తే సరిపోతుంది. జైళ్లు కూడా అవసరం లేదు’’ అని గతేడాది సుప్రీం కోర్టు పేర్కొంది. బుల్ డోజర్ల సంస్కృతిపైనా నిలదీసింది. ఈ నేపథ్యంలోనే ఇళ్లు నేలమట్టమైనవారు కోర్టును ఆశ్రయించగా.. సర్కారు సొంత ఖర్చులతో ఇళ్లు కట్టివ్వాలని న్యాయస్థానం ఆదేశించింది. ఇటీవలే దీనికి సంబంధించిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై స్పందించిన సుప్రీంకోర్టు.. యూపీలో గత 8 సంవత్సరాల్లో ఎన్ని ఎన్‌కౌంటర్లు జరిగాయో వివరించాలని డీజీపీని ఆదేశించింది. తాజాగా ఆయన బహిరంగంగా దీనిపై వివరణ ఇవ్వడం వివాదానికి దారితీసింది. ఈ వ్యవహారంపై ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలు, పౌరసంఘాలు తీవ్ర విమర్శలు గుప్పించడం చర్చకు తావిస్తోంది.