రంగారెడ్డిలో 274 మద్యం దుకాణాల కేటాయింపు

రంగారెడ్డి, జూన్‌ 27 : జిల్లాలోని 390 మద్యం దుకాణాలకు గాను 274 దుకాణాలకు సంబంధించి దరఖాస్తులు వచ్చాయని రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ శేషాద్రి తెలిపారు. ఈ దుకాణాల ఏర్పాటుకై నాగోల్‌లోని అనంతుల ధర్మారెడ్డి గార్డెన్‌లో డ్రా నిర్వహించిన లాటరీ పద్దతిలో దుకాణాలను దరఖాస్తుదారులకు కేటాయించడం జరిగిందని తెలిపారు. మొత్తం 390 దుకానాలకు గాను 116 దుకాణాలకు దరఖాస్తులు రాలేదని, వీటికై మరోసారి నోటిఫికేషన్‌ జారీ చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఎస్‌హెచ్‌ఓల వారీగా మొత్తం 10 కౌంటర్లను ఏర్పాటు చేసి దుకాణాల కేటాయింపు జరిపినట్లు ఆయన తెలిపారు. బాలానగర్‌ సర్కిల్‌ పరిధిలో 32 దుకాణాలకు గాను 28 లాటరీ ద్వారా 3 సింగిల్‌ టెండర్‌ ద్వారా కేటాయించడం జరిగిందని, మల్కాజిగిరి సర్కిల్‌లో 22 దుకాణాలకు గాను 4లాటరీ, 6 సింగిల్‌ టెండర్‌ ద్వారా, కుత్బుల్లాపూర్‌ సర్కిల్‌లో 36 దుకాణాలకు గాను 10 లాటరీ, 12 సింగిల్‌ టెండర్‌ ద్వారా కేటాయించడం జరిగిందని తెలిపారు. అదే విధంగా మేడ్చల్‌ సర్కిల్‌లో 36 దుకాణాలకు గాను 16 లాటరీ ద్వారా 3 సింగిల్‌ టెండర్‌ ద్వారా, ఉప్పల్‌ సర్కిల్‌లో 25 దుకాణాలకు గాను 19 లాటరీ ద్వారా, ఒకటి టెండర్‌ ద్వారా, సరూర్‌నగర్‌ సర్కిల్‌లో 21 దుకాణాలకు గాను 19 లాటరీ ద్వారా కేటాయించడం జరిగిందని అన్నారు. ఘట్‌కేసర్‌ సర్కిల్‌లో 56 దుకాణాలకు గాను 9లాటరీ ద్వారా, 12 సింగిల్‌ టెండర్‌ ద్వారా, హయత్‌నగర్‌ సర్కిల్‌లో 36 దుకాణాలకు గాను 6లాటరీ ద్వారా, 7 సింగిల్‌ టెండర్‌ ద్వారా, ఇబ్రహీంపట్నం సర్కిల్‌లో 17 దుకాణాలకు గాను లాటరీ ద్వారా 16 కేటాయించడం జరిగిందని ఆయన తెలిపారు. మహేశ్వరం సర్కిల్‌లో 11 దుకాణాలను లాటరీ ద్వారా, రాజేంద్రనగర్‌ సర్కిల్‌లోని 20 దుకాణాలకు 10 లాటరీ ద్వారా 4 సింగిల్‌ టెండర్‌ ద్వారా కేటాయించినట్లు ఆయన పేర్కొన్నారు. తాండూర్‌, మర్పల్లి, పరిగి సర్కిల్లకు సంబంధించి 30 దుకాణాలకు గాను 28 లాటరీ ద్వారా, 2 సింగిల్‌ టెండర్‌ ద్వారా కేటాయించినట్లు కలెక్టర్‌ వివరించారు. చేవెళ్ల, వికారాబాద్‌ సర్కిల్‌లలో గల 30 దుకాణాలకు గాను 25 లాటరీ ద్వారా, 5 సింగిల్‌ టెండర్‌ ద్వారా కేటాయించినట్లు, శేరిలింగంపల్లి సర్కిల్‌ పరిధిలోని 18 దుకాణాలను లాటరీ ద్వార కేటాయించినట్లు ఆయన తెలిపారు. దుకాణాల కేటాయింపు ప్రక్రియలో జాయింట్‌ కలెక్టర్లు సుదర్శన్‌రెడ్డి, జగన్నాథం, ఎక్సైజ్‌ డిప్యూటీ కమిషనర్‌, ఎక్సైజ్‌ సూపరింటెండెంట్లు, డిప్యూటీ కలెక్టర్‌, తహశీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.