రిజిస్ట్రేషన్‌ల ఆదాయం తగ్గింది

జిల్లా రిజిస్ట్రార్‌ శామ్యూల్‌
శ్రీకాకుళం, జూలై 21 : జిల్లాలో రిజిస్ట్రేషన్ల ఆదాయం తగ్గిందని జిల్లా రిజిస్ట్రార్‌ ఎం.శామ్యూల్‌ చెప్పారు. వార్షిక తనిఖీ కోసం టెక్కలి సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయానికి చేరుకున్న సందర్భంగా ఆయన అక్కడి విలేకర్లతో మాట్లాడారు. వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్‌కు పట్టాదారు పాసుపుస్తకం, టైటిల్‌డీడ్‌ తప్పనిసరనే నిబంధన రావడంతో రిజిస్ట్రేషన్‌ల వేగం మందగించిందన్నారు. అయితే నిబంధలనల వలన తప్పుడు రిజిస్ట్రేషన్లు జరిగేందుకు అవకాశం లేదన్నారు. మీసేవ కేంద్రాల ద్వారా నకళ్లు, ఈసీలు ఇచ్చేలా నలుగురు సబ్‌రిజిస్ట్రార్‌లు శిక్షణపొందారని చెప్పారు. జిల్లాలో శ్రీకాకుళం, హిరమండలం, మందస సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాలు ఆన్‌లైన్‌ సేవలు అందుబాటులోకి తెచ్చామన్నారు. పంచాయతీ, భూవినియోగ చట్ట రుసుంలకు, రిజిస్ట్రేషన్‌లకు సంబంధంలేదని చెప్పారు. జిల్లాలో భూమి మార్కెట్‌ విలువకు 60 శాతం రిజిస్ట్రేషన్‌ విలువ ఉండే విధంగా కసరత్తుచేస్తున్నామని, ఒకటిరెండు నెలల్లో కొత్తధరలు అమల్లోకి వస్తాయని చెప్పారు. ఈయనతో పాటు టెక్కట్‌ సబ్‌రిజిస్ట్రార్‌ గౌస్‌బేగం ఉన్నారు.