రెండో రోజూ న్యాయవాదుల ఆందోళన

ఆదిలాబాద్‌, జూలై 12 : కేంద్ర ప్రభుత్వం విధానాలను నిరసిస్తూ న్యాయవాదులు తలపెట్టిన ఆందోళన కార్యక్రమాలు రెండవ రోజు అయిన గురువారం కూడా కొనసాగింది. న్యాయవాది వృత్తిలో విదేశీ న్యాయవాదులకు అవకాశం కల్పించేలా కేంద్రం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టే బిల్లుకు వ్యతిరేకంగా జిల్లాలోని న్యాయవాదులందరూ రెండురోజులపాటు విధులను బహిష్కరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ మేరకు గురువారం కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను తగులబెట్టి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి కపిల్‌సిబాల్‌, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ బిల్లును ప్రవేశపెడితే దేశంలోని లక్షలాది మంది న్యాయవాదుల హక్కులకు భంగం వాటిళ్లుతుందని ఇప్పటికైనా కేంద్రం స్పందించి తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే ఈ నెల 30 ఢిల్లీలో న్యాయవాదులు అందరూ మహా ధర్నా నిర్వహించి ఆందోళన కార్యక్రమాలను ఉధృతం చేస్తామని ఆదిలాబాద్‌ బార్‌ అసోషియేషన్‌ అధ్యక్షుడు రాజేశ్వరరావు హెచ్చరించారు.