రైతుల సమస్యలను పరిష్కరించండి

ఆదిలాబాద్‌, జూలై 13 : జిల్లావ్యాప్తంగా 15 రోజుల్లోగా రైతులకు పంట నష్టపరిహారం పంపిణీ చేయకపోతే కలెక్టరేట్‌ను దిగ్భందిస్తామని తెలుగుదేశం పార్టీ ఆదిలాబాద్‌ ఇన్‌చార్జి పాయల శంకర్‌ హెచ్చరించారు. కరవు కింద జిల్లాకు 190 కోట్లు విడుదల అయినా ఇప్పటివరకు కేవలం 110 కోట్లు మాత్రమే విడుదల చేసి అందులో 20 శాతం మాత్రమే రైతులకు పరిహారం అందించారని ఆయన పేర్కొన్నారు. వర్షాభావ పరిస్థితుల వల్ల రైతులు వేసిన విత్తనాలు మొలెకెత్తక అవస్థలు పడుతున్నా అధికారులు పరిహారం చెల్లింపులో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. గత ఖరీఫ్‌లో తీవ్రంగా నష్టపోయిన రైతులకు బ్యాంకుల నుండి రుణాలు అందక దళారులను ఆశ్రయిస్తున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రైతు వేసిన పంటలో సాగాని మాత్రమే నష్టపరిహారం చెల్లిస్తున్నారని ఇక నుండి నష్టపోయిన పంటలకు పూర్తి నష్ట పరిహారం అందించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. రైతుల సమస్యలను పరిష్కరించపోతే తమ పార్టీ అధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడుతామని హెచ్చరించారు.