రైతు సమస్యల పరిష్కారానికి ఉద్యమాలే శరణ్యం

రైతు నేత అతుల్‌కుమార్‌ అంజాన్‌
హైదరాబాద్‌,జూలై 5 (జనంసాక్షి): రైతులకు నెలకు రూ.3వేల రూపాయల పింఛన్‌ ఇవ్వాలని ఆల్‌ ఇండియా కిసాన్‌ సభ(ఎఐకెఎస్‌) ప్రధాన కార్యదర్శి అతుల్‌కుమార్‌ అంజాన్‌ డిమాండ్‌ చేశారు. హైదరాబాద్‌లో యాదవరెడ్డి గార్డెన్స్‌లో గురువారం ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు నిర్వహించే శిక్షణ కార్యక్రమాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలో ఉందన్నారు. ఖరీఫ్‌ కాలం ప్రారంభమై నెల రోజులు గడిచినా ఇంత వరకు సరైన వర్షాలు కురవకపోవడంతో దేశ వ్యాప్తంగా ప్రాజెక్టులన్నీ ఖాళీ కుండలుగా మారాయని ఆయన అన్నారు. నకిలీ విత్తనాలను అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైందని, ఎరువులు, విత్తనాలు పురుగు మందుల రేట్లను అడ్డగోలుగా పెంచి రైతుల నడ్డి విరిచారని ఆయన ఆరోపించారు. బ్యాంకుల్లో రైతులకు రుణాలు దొరకాలంటేనే గగనంగా మారిపోయిందని, బ్యాంకులు వ్యవసాయదారులకు రుణాలు ఇచ్చేందుకు ముందుకు రావడంలేదన్నారు. ప్రభుత్వం గొప్పగా లక్షల కోట్ల రూపాయలు వ్యవసాయ దారులకు రుణాలుగా ఇప్పించామని గొప్పలు చెప్పుకుంటున్నా అవి ఆచరణలో సాధ్యంకావడంలేదన్నారు. రైతులు ఉద్యమిస్తేనే సమస్యలు పరిష్కారం అవుతాయని ఆ దిశగా రైతాంగం సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాగేశ్వరరావు, రామకృష్ణ, పశ్య పద్మ, యాదగిరిరావు, యాదగిరి రెడ్డి, నారాయణరావు, రావుల వెంకయ్య తదితరులు పాల్గొన్నారు.