లఖింపుర్‌ఖేరి ఘటనపై సీబీఐ దర్యాప్తు చేయించండి
` సీజేఐకు యూపీ న్యాయవాదుల లేఖ
లఖ్‌నవూ,అక్టోబరు 5(జనంసాక్షి): ఉత్తర్‌ప్రదేశ్‌లోని లఖింపుర్ ఖేరిలో ఆదివారం జరిగిన హింసాత్మక ఘటనలపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటనపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సీబీఐ దర్యాప్తు చేయాలని కోరుతూ ఉత్తర్‌ప్రదేశ్ న్యాయవాదులు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణకు మంగళవారం లేఖ రాశారు. రైతులపై దూసుకొచ్చిన వాహనం కేంద్రమంత్రి అజయ్ మిశ్ర కుమారుడు ఆశిష్ది అని, అందులో ఆయన కూడా ఉన్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ఇప్పటివరకు అతడిని ఎందుకు అరెస్టు చేయలేదని పోలీసులపై మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం చోటుచేసుకున్న దారుణంపై ఎఫ్ఐఆర్ దాఖలు చేసేలా హోంమంత్రిత్వశాఖను ఆదేశించాలని పిటిషన్లో న్యాయవాదులు సీజేఐని కోరారు. ఈ ఘటనతో సంబంధం ఉన్న మంత్రులను శిక్షించాలన్నారు. మరోవైపు, ఈ ఘటనలో నలుగురు రైతులు మృతిచెందగా.. ముగ్గురి భౌతికకాయాలకు అంత్యక్రియలు పూర్తయ్యాయి. మరో రైతు మృతదేహాన్ని రీ`పోస్టుమార్టం చేయనున్నట్టు సమాచారం. రైతు సంఘం నేత రాకేశ్ టికాయత్, యూపీ పోలీసుల మధ్య చర్చల అనంతరం ఈ ప్రక్రియను పూర్తి చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా ముందు జాగ్రత్తగా ఆదివారం నుంచి నిలిపివేసిన ఇంటర్నెట్ సేవలను అధికారులు ఈ సాయంత్రం పునరుద్ధరించారు. ఉత్తర్‌ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య పర్యటన నేపథ్యంలో, ఆదివారం లఖింపుర్ ఖేరీలో హింస చెలరేగిన సంగతి తెలిసిందే. నూతన వ్యవసాయ చట్టాల రద్దు కోరుతూ అక్కడి తికోనియా`బన్బీర్‌పుర్ రహదారిపై అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తుండగా… కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్ర కుమారుడు ఆశిష్ మిశ్ర కారు, మరో వాహనం వారిపైకి దూసుకెళ్లాయి. ఈ ఘటనలో నలుగురు రైతులు మరణించగా, అనంతరం జరిగిన అన్నదాతల దాడిలో మరో నలుగురు మృతిచెందారు.ఈ ఘటనకు సంబంధించి కేంద్ర మంత్రి కుమారుడు సహా పలువురిపై కేసులు నమోదయ్యాయి. ఇదిలా ఉండగా.. శాంతిభద్రతలకు విఘాతం కలిగించారనే ఆరోపణలపై ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా సహా 11 మందిపైనా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.