లఖింపూర్‌ ఘటనకు నిరసన


` కేంద్రమంత్రి కాన్వాయ్‌పై గుడ్లతో దాడిచేసి నిరసన
భువనేశ్వర్‌,అక్టోబరు 31(జనంసాక్షి):ఒడిశా పర్యటనకు వెళ్లిన కేంద్ర హోంశాఖ సహాయమంత్రి అజయ్‌మిశ్రాకు చేదు అనుభవం ఎదురైంది. కాంగ్రెస్‌ పార్టీ విద్యార్థి విభాగం నేతలు మంత్రి కాన్వాయ్‌పై కోడి గుడ్లతో దాడి చేశారు. భువనేశ్వర్‌ విమానాశ్రయం నుంచి కటక్‌లోని సీఐఎస్‌?ఎఫ్‌? క్యాంపస్‌కు కాన్వాయ్‌ వెళుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఎన్‌ఎస్‌యూఐ నేతలు నల్ల బ్యాడ్జీలను ప్రదర్శిస్తూ మంత్రిని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. అనంతరం కాన్వాయ్‌పై కోడిగుడ్లు విసిరారు.అయితే ఇటీవల జరిగిన లఖింపుర్‌ ఖేరి హింసాత్మక ఘటనలో కేంద్ర మంత్రి అజయ్‌ మిశ్రా తనయుడు ఆశిష్‌ మిశ్రా తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో అజయ్‌ మిశ్రా తన పదవికి రాజీనామా చేయాలని కాంగ్రెస్‌ పార్టీ డిమాండ్‌ చేస్తోంది. ఈ పరిణామాల మధ్య ఒడిశాకు చేరుకున్న కేంద్రమంత్రికి కాంగ్రెస్‌ పార్టీ విద్యార్థి విభాగం నుంచి నిరసన సెగ తగిలింది. మంత్రి వెనక్కి వెళ్లిపోవాలంటూ నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు.ఈ నెల 3న ఉత్తరప్రదేశ్‌లోని లఖింపుర్‌ ఖేరిలో సాగుచట్టాలకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న రైతులపైకి కారు దూసుకెళ్లిన ఘటనలో నిందితుడిగా ఆశిష్‌ మిశ్రా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ దుర్ఘటనలో నలుగురు రైతులు మృతిచెందారు. అనంతరం చెలరేగిన హింసాత్మక ఘటనలో మరో నలుగురు మృతిచెందారు. దీంతో ఈ ఘటన ఒక్కసారిగా దేశవ్యాప్తంగా సంచలనమైంది. రైతుల మృతిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. ఈ కేసులో ఆశిష్‌ మిశ్రా పేరును పోలీసులు చేర్చారు. క్రైం బ్రాంచ్‌ పోలీసు సుదీర్ఘంగా ఆయన్ని విచారించిన అనంతరం గత శనివారం ఆయనను అరెస్ట్‌ చేశారు. విచారణలో ఆశిష్‌ మిశ్రా సహకరించలేదని పోలీసులు తెలిపారు. దీంతో తొలుత 14 రోజుల జ్యుడీషియల్‌ కస్టడీ, ఆ తర్వాత పోలీసు రిమాండ్‌కు పంపించారు.