వసతి గృహాల్లో పూర్తిస్థాయి ప్రవేశాలు కల్పించాలి

ఖమ్మం, జూలై 19 : మూడు నుంచి పదవ తరగతి వరకు ఉన్న జనరల్‌ హాస్టల్‌కు, ఐదు కళాశాలల వసతి గృహాలలో విద్యార్థుల ప్రవేశాలను పూర్తి స్థాయిలో అయ్యేలా వసతి గృహ సంక్షేమ అధికారులు కృషి చేయాలని కొత్తగూడెం సహాయ సాంఘిక సంక్షేమాధికారి సత్యనారాయణ ఆదేశించారు. మెను ప్రకారం విద్యార్థులకు భోజనాన్ని అందించాలని, ప్రతి రోజు గుడ్డు పెట్టాలని అన్నారు. ప్రతి వసతి గృహంలో మొక్కలు పెంచి పచ్చదనంతో ఉంచాలన్నారు. విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందకపోతే సంబంధిత పాఠశాల ఉపాధ్యాయులతో మాట్లాడి ఇప్పించాలన్నారు. ఈ విద్యాసంవత్సరం పదవ తరగతిలో 95 శాతం ఫలితాల సాధన కోసం కృషి చేస్తున్నట్లు వివరించారు. ప్రతి వసతి గృహంలో విద్యార్థులను మొదటి నుంచి గ్రేడింగ్‌గా విభజించి వారి సామర్ధ్యాలను పెంపుదించాలన్నారు. ఎస్టీలకు 10శాతం, ఎస్సీలకు 90 శాతం అవకాశం ఉందన్నారు. ఈ విద్యార్థులకు రెండు లక్షల వరకు ఆదాయ ధృవీకరణ పత్రం ఉండాలన్నారు. కుల సంఘాలు కూడా విద్యార్థులను వసతి గృహాల్లో చేరేలా ప్రోత్సహించాలన్నారు.