విజయమ్మది మొసలి కన్నీరు..

తెలంగాణను అడ్డుకున్నది వైఎస్సే..ఉద్యమంలో పాల్గొంటే బెదిరించారు

– ఎంపీ మధుయాస్కీ

హైదరాబాద్‌, జూన్‌ 9 : తెలంగాణ ప్రజల పట్ల వైఎస్సార్‌ సీపీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ మొసలి కన్నీరు కారుస్తున్నారని నిజామాబాద్‌ ఎంపీ మధుయాస్కీ మండిపడ్డారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు.  పరకాల ప్రజలు వైఎస్‌ విజయమ్మ పర్యటనను విజయవంతం చేశారని, ఆమె పట్ల సానుభూతితో వ్యవహరించారని, అయినా ఆమె తెలంగాణకు అనుకూలంగా మాట్లాడలేదని  ఆయన అన్నారు. వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు జగన్‌ కచ్చితంగా సమైక్య వాదేనని, ఆయన తండ్రి మరణాన్ని అడ్డం పెట్టుకుని సానుభూతితో లబ్ధిపొందాలని ప్రయత్నిస్తారని ఆయన ధ్వజమెత్తారు. తెలంగాణను అడ్డుకుంది వైఎస్‌ రాజశేఖరరెడ్డేనని, తాను తెలంగాణ ఉద్యమంలో పాల్గొంటుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి వస్తుందని, తనను బెదిరించారని ఆయన తీవ్రమైన ఆరోపణ చేశారు. 2009లో తెెలంగాణలో పోలింగ్‌ పూర్తయిన వెంటనే నంద్యాల సభలో సీమాంధ్రులు హైదరాబాద్‌ వెళ్లాలంటే వీసా తీసకోవాల్సిన పరిస్థితులు వస్తాయంటూ వైఎస్‌ చేసిన వ్యాఖ్యలు నిజాం కాదా అని ఆయన నిలదీశారు. పార్లమెంట్‌లో సమైక్యాంధ్రకు మద్దతుగా తెలుగుదేశం పార్టీ ఎంపీలతో కలిసి జగన్‌ ప్లకార్డులు ప్రదర్శించింది వాస్తవం కాదా అని అన్నారు. ఈ ప్రశ్నలకు విజయమ్మ సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు. జగన్‌ కేవలం పదవీ కాంక్షతో ముఖ్యమంత్రి కావాలన్న తపనతో ఉప ఎన్నికలను తీసుకువచ్చారని, తెలంగాణ పట్ల ఆ పార్టీ వైఖరిని స్పష్టం చేయందే తెలంగాణ ప్రజలు నమ్మరన్నారు. తండ్రి పదవిని అడ్డం పెట్టుకుని లక్షల కోట్లు సంపాదించిన జగన్‌కు అధికారం అప్పగిస్తే రాష్ట్రాన్ని అమ్ముకుంటారని ఆయన ప్రజలకు సూచించారు. తెలంగాణ పట్ల జగన్‌కు గౌరవం ఉందని చెబుతున్న విజయమ్మ తెలంగాణకు అనుకూలమని ఎందుకు ప్రకటించరని ఆయన నిలదీశారు. వైఎస్‌ మరణాన్ని సైతం రాజకీయం చేసి ఎన్నికల్లో లబ్ధిపొందేందుకు వైఎస్‌ కుటుంబం  ప్రయత్నిస్తోందని అన్నారు. వైఎస్‌ మరణించిన తరువాత రెండేళ్లకు ఆయన మరణంపై అనుమానాలు ఉన్నాయంటూ అభిప్రాయాలు వ్యక్తం చేయడం రాజకీయ లబ్ధి కోసం కాదా? అని అన్నారు. తెలంగాణను అడ్డుకున్న వైఎస్‌ కుటుంబాన్ని నమ్మవద్దంటూ ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు.