విద్యాబోధన మెరుగుకు ప్రభుత్వం కృషి : కలెక్టర్‌

కరీంనగర్‌, జూలై 12  ప్రైవేట్‌ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాబోధన మెరుగుపరిచేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని జిల్లా కలెక్టర్‌ స్మితా సబర్వాల్‌ అన్నారు. గురువారంనాడు జగిత్యాల మండలంలోని అనంతారం గ్రామంలో కొత్తగా నిర్మించిన పాఠశాల భవనాన్ని ఆమె ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఎలిగందల రమణ, నిజామాబాద్‌ ఎంపి మధుయాష్కిగౌడ్‌ పాల్గొన్నారు. కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మంచి బోధన అందిస్తున్నామని అన్నారు. ప్రైవేట్‌ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో ఉన్న విద్యార్థులకు బోధనలో ఎలాంటి తారతమ్మాలు లేకుండా బోధన జరుగుతుందని ఆమె అన్నారు. బడీడు పిల్లలను తల్లిదండ్రులు పాఠశాలలో చేర్పించి వారి భవిష్యత్‌ బంగారుబాట చేయాలని ఆమె కోరారు. ఎంపి మధుయాష్కి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో విద్యాబోధనలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఉపాధ్యాయులు విద్యార్థులకు బోధిస్తున్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు విషయమై తాను కేంద్రమంత్రులపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు ఆ కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నానని, అందువల్లనే ప్రజలను కలుసుకోలేకపోతున్నానని మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆయన బదులిచ్చారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే వరకు పోరాటం సాగుతుందని అన్నారు.