విద్యుత్‌ కోతతో నష్టపోతున్న అన్నదాత

కరీంనగర్‌, జూలై 12 : రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్‌ కోత విధిస్తుండడంతో గ్రామాల్లోని ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని టిడిపి ఎమ్మెల్యే, జిల్లా పార్టీ అధ్యక్షుడు విజయరామారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్దపల్లిలో గురువారం ఆయన మాట్లాడుతూ ఇష్టానుసారంగా ప్రభుత్వం విద్యుత్‌ కోతలు విధిస్తుండడంతో రైతులు వేసిన పంటలు ఎండిపోయి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత ఖరీఫ్‌సీజన్‌లో కూడా విద్యుత్‌ సరఫరా కానందున, ఈదురు గాలులతో పంటలు నాశనమైపోయాయని అన్నారు. ఇంతముందు రైతులు తీసుకున్న బ్యాంకు రుణాలు మాఫి చేసి కొత్త రుణాలు అందించాలని ఆయన డిమాండ్‌ చేశారు. విద్యుత్‌ కోతలు నిలిపివేయకపోతే ఈ నెల 16, 17, 18 తేదీల్లో తెలుగుదేశం పార్టీ జిల్లా నలుమూలల ధర్నాలు, రాస్తారోకోలు చేపడుతుందని అన్నారు.