వీహెచ్‌కు వీరమణి అవార్డు

కిరణ్‌ విద్యుత్‌ చార్జీలపై పునరాలోచించు : వీహెచ్‌
హైదరాబాద్‌, జనవరి 6 (జనంసాక్షి) :
కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు వి. హనుమంతరావు పెరియార్‌ అంతర్జాతీయ వీరమణి అవార్డుకు ఎంపికయ్యారు. ఈ సం దర్భంగా ఓబీసీ మేధావుల ఫోరం ఆధ్వర్యంలో ఆయనను హైదరాబాద్‌ లోని జూబ్లీహాల్‌లో ఘనంగా సన్మానిం చారు. ఈ సందర్భంగా వీహెచ్‌ మాట్లా డుతూ, ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి విద్యుత్‌ చార్జీల పెంపుపై పునరాలో చించాలని కోరారు. ఇప్పటికే పెరిగిన చార్జీలతో సామాన్యులు బతకలేని పరిస్థితి తలెత్తిందని, మళ్లీ చార్జీలు పెంచితే ఆ ప్రభావం అన్ని రంగాలపై పడుతుందన్నారు. అలాగే కాంగ్రెస్‌ ప్రభుత్వంపె ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉత్పన్నమవుతుందని, దానిని తట్టుకోవడం ఎవరి తరం కాదన్నారు. దళిత, గిరిజనులకు లాగానే బీసీలకు పూర్తిస్థాయిలో రిజర్వేషన్లు వర్తింపజేయాలని కోరారు. విద్యుత్‌ చార్జీల భారం మోయాలని ఏఐసీసీ అధినేత్రి సోనియాగాంధీ, ప్రధాని మన్మోహన్‌సింగ్‌ను కలిసి విజ్ఞప్తి చేస్తానన్నారు. కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి, జాతీయ బీసీ కమిషన్‌ చైర్మన్‌ ఎంఎస్‌ రావు, బీజేపీ నాయకుడు దత్తాత్రేయ తదితరులు పాల్గొన్నారు.