వైఎస్‌ మరణాన్ని రాజకీయం చేస్తున్నారు

 రాజకీయం చేస్తున్నారు

వైఎస్‌ మరణాన్ని రాజకీయం చేస్తున్నారు

సోమవారం స్థానిక బద్దం ఎల్లారెడ్డి భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి తెలంగాణ వాదాన్ని గెలిపించాలని, రాజకీయ ఐకాస బలపరుస్తున్న టీిఆర్‌ఎస్‌కు మద్దతునివ్వాలని కోరారు. దివంగత వైఎస్‌ రాజశేఖరరెడ్డి మరణాన్ని కాంగ్రెస్‌, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలు రాజకీయంగా ఉపయోగించుకునేందుకు కుట్ర పన్నుతున్నాయని ఆయన ఆరోపించారు. ఈ రెండు పార్టీల నేతలు మూడేళ్ళ క్రితం జరిగిన రాజశేఖరరెడ్డి మృతిపై ప్రజల్లో మళ్లీ అనుమానాలు రేకెత్తించాలని చూస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో 18 శాసనసభా స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో రాజశేఖరరెడ్డి మృతి అంశాన్ని తిరగదోడడం సమంజసం కాదన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పరిస్థితి పూర్తిగా ఇరకాటంలో పడిందని అటు వైఎస్‌ రాజశేఖరరెడ్డిని సమర్థించలేక, ఇటు విమర్శించలేక ఆ పార్టీ నేతలు సతమతమవుతున్నారని చెప్పారు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు జగన్‌ వేల కోట్ల అక్రమ ఆస్తులు కూడబెట్టాడని రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జీ గులాం నబీ ఆజాద్‌ ఉప ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఇంతకాలం రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాలను పర్యవేక్షించిన ఆజాద్‌కు జగన్‌ అక్రమాస్తుల వ్యవహారం తెలియదా అని ఆయన సూటిగా ప్రశ్నించారు.  కరీంనగర్‌ పట్టణ సుందరీకరణలో భాగంగా అభివృద్ధి పరుస్తున్న ముఖ్య కూడళ్ళల్లో జిల్లావాసి, దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు విగ్రహం నెలకొల్పకపోవడం శోచనీయమన్నారు. నగరంలో పీవీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే నగర ప్రతిష్ఠ, గౌరవం పెరుగుతుందని చెప్పారు. వివిధ సంస్థలు బస్‌ స్టేషన్‌ కూడలిలో పివి విగ్రహ ఏర్పాటుకు అనుమతి కోరుతూ దరఖాస్తు చేయగా, వాటిని పరిశీలించకుండా రాత్రికిరాత్రే అక్కడ మాజీ శాసనసభాధిపతి దుద్దిల్ల శ్రీపాద రావు విగ్రహం ఏర్పాటు చేయడం సమంజసంగా లేదన్నారు. ఇది మంత్రి శ్రీధర్‌బాబు ప్రతిష్టకు అంత మంచిదికాదన్నారు. ఇప్పటికైనా మంత్రి, జిల్లా యంత్రాంగం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి శ్రీపాద విగ్రహ ఏర్పాటు అంశం వివాదాస్పదం కాకుండా చూడాల్సిన అవసరము ఉందన్నారు. ఈ విలేకరుల సమావేవంలో సిపిఐ జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎన్‌. రామయ్య, బోయిని అశోక్‌, కె. రామ్‌గోపాల్‌రెడ్డి, పెండ్యాల అయిలయ్య తదితరులు పాల్గొన్నారు.