వైఎస్‌ వారసులం మేమే

గులాం నబీ ఆజాద్‌
న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 7 (జనంసాక్షి): దివంగత నేత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి వారసత్వం తమదేనని కాంగ్రెస్‌ అధిష్ఠానం పెద్దలు ఉద్ఘాటించారు. శుక్రవారంనాడు ఇక్కడ ‘వైఎస్‌ పాదయాత్ర- మై డైరీ’ పుస్తకావిష్కరణ సభ జరిగింది. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి పాదయాత్రపై రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచందర్‌రావు దీనిని సంకలనం చేశారు. ఈ సందర్భంగా
జరిగిన సభలో పుస్తకాన్ని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మోతీలాల్‌ వోరా ఆవిష్కరించారు. ఆంధ్రప్రదేశ్‌ సీనియర్‌ నేత ఎం.సత్యనారాయణ రావును ఆయన సత్కరించారు. సభలో గులాం నబీ ఆజాద్‌, వాయలార్‌ రవి, మోతీలాల్‌ వోరా, టి సబ్బిరామిరెడ్డి ప్రసంగించారు. కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల పరిశీలకు వాయలార్‌ రవి మాట్లాడుతూ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి పాదయాత్ర చేపట్టిన సమయంలో తాను పార్టీ ఆంధ్రప్రదేశ్‌ వ్యవహారాల ఇన్‌చార్జిగా ఉన్నానని చెప్పారు. వైఎస్‌ పాదయాత్ర చరిత్ర సృష్టించిందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌ పార్టీ ఈ యాత్రతో మరింత బలపడి వేళ్లూరుకున్నదని అన్నారు. వైఎస్‌ పాదయాత్రకు తాను పూర్తిగా మద్దతు ఇచ్చానని, పాదయాత్ర ఆంధ్రప్రదేశ్‌లో పార్టీని అధికారంలోకి తెస్తుందని తాను పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి చెప్పానని ఆయన అన్నారు. వైఎస్‌ పాదయాత్రలో తాను పాల్గొన్న తర్వాత ఆ విషయం చెప్పానని ఆయన అన్నారు. ఏ కోణంలో చూసినా వైఎస్‌ కాంగ్రెస్‌ మనిషే అని, నెహ్రూ, ఇందిరాగాంధీ కుటుంబాలకు విధేయుడని ఆయన అన్నారు. కాంగ్రెస్‌తోనే తన రాజకీయం ముడిపడి ఉందని వైఎస్‌ఆర్‌ చెబుతూ ఉండేవారని ఆయన గుర్తు చేసుకున్నారు. వైఎస్‌ వారసత్వం కాంగ్రెస్‌ పార్టీదేనని, కాంగ్రెస్‌కు చెందిన వైఎస్‌ఆర్‌ వారసత్వ హక్కు కాంగ్రెస్‌దేనని వేరేవాళ్లు ఆ వారసత్వాన్ని ఆడగడానికివీల్లేదని ఆయన అన్నారు. వైఎస్‌ వారసత్వం కాంగ్రెస్‌ పార్టీకి ప్రయోజనం చేకూరుస్తుందని భావిస్తున్నామని ఆయన అన్నారు. కాంగ్రెస్‌ ఆంధ్రప్రదేశ్‌ వ్యవహారాల ఇన్‌చార్జి గులాం నబీ ఆజాద్‌ మాట్లాడుతూ వైఎస్‌ కాంగ్రెస్‌ పార్టీకి కట్టుబడిన నాయకుడని అన్నారు. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ఏ రోజు కూడా లక్ష్మణరేఖ దాటలేదని ఆయన ప్రశంసించారు. ఆయన కుటుంబ సభ్యులు ఆయనలా వ్యవహరించలేదన్నారు. వైఎస్‌ పాదయాత్ర అత్యంత విజయవంతమైన యాత్ర అని ఆయన అన్నారు. వైఎస్‌ఆర్‌ కరుడుగట్టిన కాంగ్రెస్‌ వాది అని కొనియాడారు. ఆయన గొప్ప నాయకుడే కాదు, క్రమశిక్షణను పాటించిన వ్యక్తి అని ఆయన అన్నారు. వైఎస్‌ ఒక ప్రత్యేక సామాజిక వర్గానికి చెందినవాడైనా అన్ని సామాజిక వర్గాల ఆదరణను చూరగొన్న గొప్ప నాయకుడన్నారు. వైఎస్‌ఆర్‌ ముందు నుంచి చాలా డైనమిక్‌గా ఉండేవారన్నారు. యువజన కాంగ్రెస్‌ నుంచి తామంతా కలిసి పనిచేశామన్నారు. అప్పట్లో చంద్రబాబు, కేసిఆర్‌ కూడా తమ సహచరులేనని, అయితే తర్వాత కాలంలో ముగ్గురు మూడు మార్గాల్లో పయనించారని ఆజాద్‌ వైఎస్‌తో తనకున్న అనుబంధాన్ని, సాహచర్యాన్ని గుర్తు చేసుకున్నారు.
వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ప్రతిపక్ష నేతగా కూడా రాణించారని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మోతీలాల్‌ వోరా అన్నారు. సంక్షేమ పథకాలను వైఎస్‌ విజయవంతంగా అమలు చేశారని ఆయన అన్నారు. వైఎస్‌ ప్రజానాడి తెలిసిన నాయకుడని ఆయన అన్నారు. ఈ కార్యక్రమానికి పార్లమెంట్‌ సభ్యుడు ఉండవల్లి అరుణ్‌కుమార్‌ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో దిగ్విజయ్‌సింగ్‌, జనార్దన్‌ ద్వివేది, రాజీవ్‌ శుక్లా, ఆస్కార్‌ ఫెర్నాండెజ్‌, ఆర్‌కె ధావన్‌తో పాటు పార్లమెంట్‌ సభ్యులు జెడి శీలం, పొన్నం ప్రభాకర్‌, లగడపాటి రాజగోపాల్‌, సాయి ప్రతాప్‌, రాజయ్య, నంది ఎల్లయ్య, చిరంజీవి, ఎం.సత్యనారాయణరావు, టి.సుబ్బిరామిరెడ్డితో పాటు రాష్ట్ర మంత్రులు కాసు కృష్ణారెడ్డి, గల్లా అరుణకుమారి తదితరులు పాల్గొన్నారు.