వ్యవసాయరంగాన్ని విస్మరిస్తే పెనుముప్పు : రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ

హైదరాబాద్‌: వ్యవసాయ, సేవా , ఉత్పత్తి రంగాల ప్రాధాన్యతని ఎప్పటీకీ విస్మరించ కూడదని రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు. వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేస్తే ఆహార భద్రతకే పెనుముప్పు వాటిల్లే ప్రమాదముందని ఆయర ఆందోళన వ్యక్తం చేశారు. కోత్త పరిశ్రమల ఏర్పాటు వ్యవసాయాధారిత  భూముల్లో కాకుండా బీడు భూముల్లో జరగాల్సి ఉందని ఆయన అన్నారు. హైదరాబాద్‌ ఫ్యాప్సీలో జరిగిన సమావేశానికి హాజరైన రాష్ట్రపతి పారిశ్రామికవేత్తలను ఉద్దేశించి ప్రసంగించారు. 2030 నాటికి మనదేశం యువభారత్‌గా మారనుందని, యువతలో నైపుణ్యాన్ని పెంచాల్సిన అవసరముందని ఆయన తెలియజేశారు. ఐదు వందల  మిలియన్‌ల వ్యక్తులకు నైపుణ్యతను కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదీ, పారిశ్రామికవేత్తలదీ అన్నారు. ప్రస్తుత దేశీయ ఆర్ధిక పరిస్థితుల దృష్ట్యా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల అవశ్యకత ఎంతైనా ఉందని తెలియజేశారు. దేశం ఎదుర్కొంటున్న సమస్యలకు పారిశ్రామికవేత్తలు పరిశోధనాత్మక పరిష్కార మార్గాలను చూపించాల్సిన అవసరం ఉందన్నారు. దేశంలో త్వరితగతిన వృద్థి చెందుతున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌ ముందుందని కితాబిచ్చారు.