శివసేన అత్యవసర భేటీ

ముంబయి, నవంబర్‌ 2 : శివసేన ఎగ్జిక్యూటివ్‌ ప్రెసిండెంట్‌ ఉద్దవ్‌ ఠాక్రే శుక్రవారం నాడు అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. శివసేన అధినేత బాల్‌ ఠాక్రే అనారోగ్యంతో ఉన్న కారణంగా ఆయనను కలుసుకున్న ఉద్దవ్‌ ఠాక్రే వెనువెంటనే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అందుబాటులో ఉన్న రాష్ట్ర శాసనసభ్యులను, పార్లమెంట్‌ సభ్యులను సమావేశానికి రావాల్సిందిగా పిలుపువెళ్లింది. 1966లో శివసేన స్థాపించిన తరువాత బాల్‌ ఠాక్రేనే అధ్యక్షుడిగా ఉన్నారు. ఆ తదనంతరం పీఠాన్ని ఉద్దవ్‌ ఠాక్రేకు అందజేశారు. దసరా ఉత్సవాల సందర్భంగా శివసేన నిర్వహించే భారీ ర్యాలీలో కూడా మరాఠి పులి బాల్‌ఠాక్రే హాజరుకాకపోవడమే కాకుండా ఆయన ప్రసంగాన్ని వీడియో టేపులో తీసుకువచ్చి కార్యకర్తలకు వనిపించారు. తన కొడుకు ఉద్దవ్‌ ఠాక్రేకు, మనవడు ఆధిత్యకు మద్దతు ఇవ్వాల్సిందిగా ఆయన పిలుపునిచ్చారు. శారీరకంగా కుంగిపోయి నడవలేని పరిస్థితుల్లో ఉన్నానని, ఆ వీడియో టేపులో వెల్లడించారు. ఇదిలా ఉండగా గురువారం నాడు బాల్‌ఠాక్రేను ఆయనకు అత్యంత సన్నిహితుడైన మహారాష్ట్ర నవ నిర్మాణ సేన అధినేత రాజ్‌ ఠాక్రే కలుసుకుని చర్చలు జరిపారు. త్వరలో మహారాష్ట్ర నవనిర్మాణ సేన శివసేనతో జతకట్టే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.