సత్వరమే పరిష్కరిస్తాం

కరీంనగర్‌, జూలై 23 : డయల్‌యువర్‌ కలెక్టర్‌ కార్యక్రమంలో ప్రజలు ఫోన్‌ ద్వారా తెలిపిన సమస్యలను సత్వరం పరిష్కరిస్తున్నట్లు జాయింట్‌ కలెక్టర్‌ హెచ్‌.అరుణ్‌కుమార్‌ అన్నారు. సోమవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో వివిధ శాఖల అధికారులను సమావేశపరిచి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. వేములవాడ నుంచి ఒకరు ఫోన్‌చేసి నగర పంచాయితీ పరిధిలో అక్రమ కట్టడాలు నిర్మిస్తున్నారని తెలుపగా జాయింట్‌ కలెక్టర్‌ స్పందిస్తూ జిల్లా పంచాయితీ అధికారిచే విచారణ జరిపి చర్యలు తీసుకొనగలమని అన్నారు. జూలపల్లి మండలం నుండి సత్యం అనే వ్యక్తి ఫోన్‌ చేసి గ్రామంలో 5030 చౌకధర దుకాణాల డీలర్‌ సక్రమంగా సరుకులు పంపిణి చేయడంలేదని తెలుపగా పరిశీలించి చర్య తీసుకుంటామన్నారు. కరీంనగర్‌ బాగ్యనగర్‌ నుంచి ఒకరు ఫోన్‌ చేసి డ్రైనేజీ సదుపాయం లేక మురుగు నీరు నిల్వ ఉంటోందని తెలుపగా జాయింట్‌ కలెక్టర్‌ స్పందిస్తూ నగరపాలక సంస్థ కమీషనర్‌ పరిశీలించి తగు చర్య తీసుకొంటారని తెలిపారు. ఈ కార్యక్రమానికి మొత్తం ఎనిమిది మంది ఫోన్‌ చేసి తమ సమస్యలు పరిష్కరించాలని కోరగా సంబంధిత అధికారులు సత్వరం పరిష్కారం చేయవలసిందిగా ఆదేశించారు. జిల్లాలోని మారుమూల ప్రదేశాలు, దూర ప్రాంతాల ప్రజలు జిల్లా కేంద్రానికి వచ్చి సమస్యలు చెప్పుకోవడం ఇబ్బంది కనుక అటువంటి వారి సౌకర్యార్థం ప్రతి సోమవారం ఉదయం 10 నుండి 10-30 గంటల వరకూ నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు జాయింట్‌ కలెక్టర్‌ చందర్‌ అబ్నార్‌, డిఆర్‌ఓ పిచిఆర్‌ ప్రసాద్‌, డిఆర్‌డిఏ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ జె.శంకరయ్య, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.