సన్మార్గంలో నడిపించేది భక్తి మార్గమే..

ఏలూరు, ఆగస్టు 2 : భక్తిమార్గం సమాజాన్ని సన్మార్గంలో నడిపిస్తుందని జిల్లా కలెక్టర్‌ డా. జి. వాణీమోహన్‌ పేర్కొన్నారు. స్థానిక ఆర్‌ ఆర్‌ పేట శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో తిరుమల తిరుపతి దేవస్థానాలు, దేవాదాయ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన మనగుడి మహోత్సవానికి కలెక్టర్‌ ముఖ్య అతిథిగా వచ్చేసారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ మానవ పరిస్థితుల్లో అకృత్యాలు పెచ్చుమీరుతున్న నేపథ్యంలో సనాతన ధర్మ ప్రచారానికి దీక్ష వహించి కృషి చేయవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందని పేర్కొన్నారు. ధర్మమార్గంలో పయనించి మనసా, వాచా, కర్మణాహ: భక్తి మార్గంలో పయనిస్తూ జీవితాలను సార్థక్యం చేసుకోవాలని సూచించారు. జిల్లాలో 2 వేల 500 దేవాలయాల్లో మనగుడి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా దేవాదాయశాఖ సహాజ కమిషనర్‌ శ్రీ వి. సత్యనారాయణ, ఆలయ ఛైర్మన్‌ కె.వి.రామకృష్ణ, ఇఓ టి. విశ్వేశ్వరావు, ఆలయ ధర్మకర్తలు ఎ.విజయ, ఇ. రఘుబాబు, ఎ. సత్యం, ప్రభృతులు జిల్లా కలెక్టర్‌కు పూర్ణకుంభ ఆహ్వానంతో స్వాగతం పలికి ఆలయ మర్యాదలు అనుసరించి ఉచిత రీతిన సత్కరించారు. ఈ సందర్భంగా టిటిడి అందజేసిన కంకణాలను జిల్లా కలెక్టర్‌ భక్తులకు అందజేశారు. అనంతరం కలెక్టర్‌ శ్రీవారిని సేవించుకుని అమ్మవారికి కుంకుమార్చన చేశారు. ఈ కార్యక్రమంలో టిటిడి ధర్మ పరిషత్తు ఆర్గనైజర్‌ పుల్లారావు, తదితరులు పాల్గొన్నారు.