సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక కార్యక్రమం

కరీంనగర్‌, జూలై 11 : రెవెన్యూ శాఖకు సంబంధించిన సమస్యలను పరిష్కరించేందుకు ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని జిల్లాలో నిర్వహిస్తున్నామని జాయింట్‌ కలెక్టర్‌ హెచ్‌.అరుణ్‌కుమార్‌ బుధవారం నాడు తెలిపారు. ప్రజావాణిలో వస్తోన్న దరఖాస్తులలో 50 శాతంకుపైగా భూ సంబంధమైన సమస్యలకు సంబంధించి ఉంటున్నాయని, అంతేకాకుండా చిన్న తరహా సమస్యలైన ల్యాండు డాక్యుమెంట్‌ సర్టిఫైడ్‌ కాపీ, మ్యుటేషన్‌ చేయుట, భూ సరిహద్దులు జీమార్కేషన్‌ వంటి సమస్యల పరిష్కారం కోసం దరఖాస్తు దారులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. గతంలో రెవెన్యూ సదస్సులు నిర్వహించి ప్రజల రెవెన్యూ సమస్యలను పరిష్కరించడం జరిగిందని, అదే రీతిలో సమస్యలను పరిష్కరించేందుకు జిల్లా కలెక్టర్‌ ఈ ప్రత్యేక కార్యక్రమానికి చొరవతో శ్రీకారం చుట్టారని ఫలితంగా ఎన్నో ఏళ్లుగా పరిష్కారం కాని సమస్యలను పరిష్కారమవుతున్నాయని తెలిపారు. అందులో భాగంగా జిల్లాలోని ప్రతి రెవెన్యూ డివిజనల్‌ అధికారి తన పరిధిలో వారానికి ఒక మండలం సందర్శిస్తారని, ఏ మండలానికి ఏ తేదీన వెళ్లుతున్నది, తదితర వివరాలను ముందుగా గ్రామాలకు, ప్రజలకు తెలియజేసి, విస్తృత ప్రచారం కల్పిస్తామని తెలిపారు. ప్రకటించిన మండలంకు సంబంధించిన దరఖాస్తులను ఆర్డీవో ఆ రోజు స్వీకరిస్తారని ఈ కార్యక్రమానికి ఆయా సంబంధిత మండలంలోని విఆర్‌వోలు అందరూ అన్ని గ్రామాల రికార్డులలో హాజరుకావాలని అలాగే మండల స్థాయి రెవెన్యూ అధికారులు, సర్వేయర్లు పాల్గొంటారని తెలిపారు. దరఖాస్తుదారుల సమస్యలను అక్కడికక్కడే విఆర్వోల వద్ద అందుబాటులో ఉండే రికార్డులను పరిశీలించి సమస్యలను పరిష్కరిస్తారని, ఒకవేళ పరిష్కారానికి వ్యవధి అవసరమైతే ఆ విషయాన్ని దరఖాస్తుదారులకు తెలియజేస్తారని, దరఖాస్తులన్నింటిని ఒక రిజిస్టార్‌లో నమోదు చేసి సకాలంలో పరిష్కరించేందుకు కృషి చేస్తారని తెలిపారు. ఈ అవకాశాన్ని వినియోగించుకొని సమస్యలు పరిష్కరించుకోవాలని జాయింట్‌ కలెక్టర్‌ కోరారు.