సాంప్రదాయేతర ఇంధన వనరులే మేలైనవి

బెంగుళూరు: దేశ అవసరాలకు చాలినంత విద్యుత్‌ కావాలంటే అణు విద్యుత్‌పైనే ఆధారపడనవసరం లేదని, దేశ విద్యుత్‌ అవసరాలు తీర్చేందుకు సాంప్రదాయేతర ఇంధన వనరులే మేలైనవని బెంగుళూరులోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు. దీనిపై వారు  చేసిన అధ్యయన వివరాలను కరెంట్‌సైన్స్‌ పత్రికలో ప్రచురించారు.  ఈ నివేదిక అణువిద్యుత్‌కు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమానికి ఊపు నిచ్చేదిగా ఉంది. దేశ విద్యుత్‌ అవసరాలు సౌరశక్తి, ఇతర సాంప్రదాయ ఇంధన వనరుల ద్వారా తీరుతాయని, దాని కోసం ప్రత్యేకంగా అణు విద్యుత్‌ కేంద్రాలు అవసరం లేదని ఈ పరిశోధనలో పేర్కొన్నారు. ఐఐఎన్‌సికి చెందిన ప్రొఫెసర్లు మితచవన్‌, శ్రీనివాసన్‌ నేతృత్వంలో ఈ పరిశోధన జరిగింది. దేశంలో కేవలం 4.1 శాతం వ్యవసాయానికి పనికిరాని భూమిని సౌర విద్యుత్‌ కోసం కేటాయిస్తే సుమారు 3400 టీడబ్ల్యూహెచ్‌ల విద్యుత్‌ను ఉత్పత్తి చేయవచ్చని ఇది 2070లో భారత్‌కు కావాల్సిన వార్షిక విద్యుత్‌ అవసరాలలో సమానమని వారు పేర్కొన్నారు. ఇతర ఇంధన వనరులను లెక్కలోకి తీసుకోకుంటే కేవలం 3.1 శాతం భూమి సరిపోతుందని పేర్కొన్నారు.