స్థానిక ఎన్నికల వాయిదా వల్లే కార్యకర్తల్లో నైరాశ్యం : శంకరరావు

హైదరాబాద్‌, జూన్‌ 27 :స్థానిక సంస్థల ఎన్నికలను వెంటనే జరిపించాలని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ మంత్రి పి.శంకరరావు ప్రభుత్వాన్ని డిమాండు చేశారు. బుధవారంనాడు సిఎల్‌పి కార్యాలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికలు జరగడంలో ఆలస్యం అవుతుండడంతో అభివృద్ధి కుంటుపడుతోందన్నారు. అనేక సమస్యలు పేరుకుపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలను త్వరగా జరిపించాలని, లేకుంటే ప్రజలు మరిన్ని ఇబ్బందులు పడడం ఖాయమన్నారు. కాంగ్రెస్‌ శ్రేణుల్లో ఉత్తేజాన్ని రేకెత్తించేందుకు స్థానిక సంస్థల ఎన్నికలను తప్పనిసరిగా నిర్వహించాలని కోరారు. ఎన్నికలు నిర్వహిస్తే కాంగ్రెస్‌ పార్టీకి, ప్రభుత్వానికి లాభంగా ఉంటుందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేస్తూ పోతుండడంతో ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళుతున్నాయన్నారు. దీన్ని ఆసరా చేసుకుని విపక్షాలు ప్రభుత్వంపై ఎదురుదాడికి దిగుతున్నాయన్నారు. ముఖ్యంగా క్యాట్‌ తీర్పును సవాల్‌ చేస్తూ ప్రభుత్వం హైకోర్టుకు వెళ్లడం సరైన పద్ధతి కాదన్నారు. డీజీపీ దినేష్‌రెడ్డి నియామకం చెల్లబోదని కేంద్ర ట్రిబ్యునల్‌ ఆదేశాన్ని ప్రభుత్వం తప్పనిసరిగా పాటించాలని సూచించారు. పోలీసు అధికారుల పదోన్నతిపై క్యాట్‌ ఇచ్చిన తీర్పును ప్రభుత్వం గౌరవించాలని, లేనిచో ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని అన్నారు. పోలీసు అధికారి గౌతమ్‌కుమార్‌ స్వచ్చంద పదవీ విరమణ చేయడం దురదృష్ట కరమని వ్యాఖ్యానించారు. గౌతమ్‌కుమార్‌ నిర్ణయంతో ప్రభుత్వంపై విపక్షాలు మరిన్ని ఆరోపణలకు దిగే అవకాశం ఉందన్నారు. ముఖ్యంగా తెలంగాణపై కాంగ్రెస్‌ అధిష్టానం సరైన నిర్ణయం తీసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 2014 ఎన్నికల వరకు ముఖ్యమంత్రిగా కిరణ్‌కుమార్‌రెడ్డి ఉంటే.. తనకు అభ్యంతరం లేదని, అలా అయితే కాంగ్రెస్‌ పరిస్థితి 90కి పరిమితం కావడం ఖాయమన్నారు. పార్టీ సీనియర్లను ముఖ్యమంత్రి కిరణ్‌ నిర్లక్ష్యం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. అవినీతి, ఆరోపణలను ఎదుర్కొంటున్న మంత్రులపై ముఖ్యమంత్రి చర్యలు తీసుకోకపోతే ఆయన ఎంత నిజాయితీగా ఉన్నా లాభం లేదని శంకరరావు అన్నారు. అవినీతి మంత్రులను తక్షణమే తొలగించి ముఖ్యమంత్రి తన నిజాయితీని నిరూపించుకోవాలని శంకరరావు సవాల్‌ చేశారు.