హింసతో సాధించలేనిది

ప్రేమతో సాధించొచ్చు : ప్రణబ్‌
కాశ్మీర్‌, సెప్టెంబర్‌ 27 (జనంసాక్షి) : హింసతో ఏ సమస్యా పరిష్కారం కాదని రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ అన్నారు. ప్రేమ, ఆప్యాయతలతో వేడిని చల్లర్చవ చన్నారు. సమస్య సత్వర పరిష్కారానికి ఓపిక, సహనంపరిహారం ప్రధాన సాధనాలుగా పని చేస్తాయని చెప్పారు. రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారిగా కాశ్మీర్‌లో పర్యటిస్తున్న ప్రణబ్‌ గురువారం కాశ్మీర్‌ యూనివర్సిటీ 18వ వార్షికోత్సవంలో ప్రసంగించారు. సమాజంలో ఎన్నో సమస్యలు, మరెన్నో ఫిర్యాదులున్నాయని, వాటన్నింటినీ సత్వరమే పరిష్కరించాల్సిన అవసరం ఉందన్నారు. కాశ్మీరీ ప్రజలు స్వేచ్ఛాయుత వాతావరణంల జీవించేందుకు భారత ప్రభుత్వంతో పాటు జమ్మూ రాష్ట్ర సర్కారు అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు. అందరితో సమానంగానే కాశ్మీర్‌ ప్రజలకు సమాన హక్కులు, అవకాశాలు కల్పించేందుకు ఆయా ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని తెలిపారు. సమస్యల సత్వర పరిష్కారానికి, పారదర్శకమైన సమాజాన్ని నిర్మించేందుకు ప్రతిభావంతమైన యువత ముందుకు రావాలని విద్యార్థులకు సూచించారు. ‘హింస ద్వారా సమస్య ఎప్పటికీ పరిష్కారం కాదు. దానివల్ల ఇరువైపుల వారు బాధ తప్పడం తప్ప ఒరిగేదేవిూ ఉండదు. ఉద్రిక్త పరిస్థితులను ప్రేమ, ఆప్యాయత, పరిహారం, ఓపికలతో చల్లర్చవచ్చు’ అని అన్నారు. కాశ్మీర్‌ ప్రజలకు సమాన అవకాశాలు కల్పించడం ద్వారా భారత్‌ అభివృద్ధి బాటలో సాగుతుందని చెప్పారు. ‘మరింత సమయాన్ని వృథా చేసుకోవద్దు. ప్రపంచం మొత్తం మారుతోంది. ఈ నేపథ్యంలో మనం వెనుకబడకూడదు. భారత అభివృద్ధిలో కాశ్మీరి యువకులు కీలక పాత్ర పోషించాలని’ సూచించారు. ‘గత హింసాత్మక ఘటనలను, చీకటి రోజులను మరిచిపోదాం. విభేదాలను పక్కనబెడదాం. కొత్త ఆశలతో ముందుకు వెళ్దాం. భవిష్యత్‌ కోసం ఉమ్మడిగా ముందుకు సాగుదాం. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మనదేనని విశ్వాసం కల్పిద్దాం’ అని పిలుపునిచ్చారు. భారతీయ యువత జాతిని పటిష్టవంతంగా, బలమైన దేశంగా మార్చుతుందని తనకు పూర్తి విశ్వాసముందని ప్రణబ్‌ అన్నారు. జమ్మూ గవర్నర్‌ ఎన్‌ఎన్‌ వోరా, ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లా, వీసీ అహ్మద్‌ తదితరులు పాల్గొన్నారు.