అంగన్‌వాడీలను ఆదుకున్న ఘనత బాబుదే
విజయవాడ,జూన్22(జనం సాక్షి ):అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలకు వేతనాలు పెంచి ముఖ్యమంత్రి చంద్రబాబు వారికి ఆత్మబంధువు అయ్యారని ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న అన్నారు. గతంలో ఎప్పుడూ ఇంతగా జీతాలు పెంచిన దాఖలాలు లేవన్నారు. ఇది అంగన్‌వాడీల్లో ఆత్మస్థయిర్యం నింపే చర్యని అన్నారు. వేతనాలు పెంచినందుకు వారి తరపున ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తెదేపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇప్పటి వరకు రెండు సార్లు వేతనాలు పెంచారని, రానున్న రోజుల్లో మరిన్ని సదుపాయాలు కల్పించే ఆలోచనలో ప్రభుత్వం ఉందని చెప్పారు. వేసవిలో మే నెల అంగన్‌వాడీ కేంద్రాలకు సెలవులు ప్రకటించాలని, ఇతర విధులు అప్పగించకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబుకు సూచించినట్లు చెప్పారు. కార్యకర్తలకు వేతనాల పెంపు చేశారని, అందుకు తాను సంఘం తరఫున సిఎంకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు చెప్పారు. అదే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు సంక్షేమ పథకాలు బడుగు, బలహీనవర్గాల కోసం ప్రవేశపెడుతున్నారన్నారు. చంద్రన్న పెళ్లి కానుక ద్వారా బీసీలకు రూ.35 వేలు అందజేస్తున్నారని తెలిపారు. అంగన్‌వాడీ టీచర్లకు రూ.7000 నుంచి రూ.10,500కు వేతనాన్ని పెంచారని వివరించారు. అంగన్‌వాడీ ఆయాలకు రూ.4500 నుంచి రూ.6000కు వేతనం పెంచారన్నారు. ముస్లిం మైనార్టీలకు రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షలకు పెంచారని గుర్తు చేశారు. నాయీ బ్రాహ్మణులకు తల ఒక్కంటికీ రూ.13 నుంచి రూ.25కు పెంచారని, ఈ పెంపు వల్ల వారికి ఆదాయం పెరుగుతుందన్నారు. తాజాగా జరిగిన మంత్రివర్గ సమావేశంలో వ్డడెర, ప్లలెకారులు, రజకుల, ఎస్సీ, ఎస్టీ కులాల స్థితిగతులపై కమిషన్ వేసి నివేదిక ఆధారంగా శాసనసభలో తీర్మానం చేసి కేంద్రానికి పంపుతామని నిర్ణయించినందుకు ధన్యవాదాలు తెలిపారు.