అంగన్‌వాడీల ద్వారా కెజీ విద్య ప్రమోషన్‌

ఖర్చు తగ్గడంతో పాటు విద్యార్థుల సంఖ్యను పెంచే ఆలోచన
అధికారుల కసరత్తు
హైదరాబాద్‌,ఏప్రిల్‌24(జ‌నంసాక్షి): సర్కారు బడుల్లో అంగన్‌వాడీ కేంద్రాలు విలీనం చేయడం ద్వారా ప్రాథమిక విద్యను బలోపేతం చేయాలని ప్రభుత్వం నిర్ణయించినా ఆ దిశగా ప్రయత్నాలు పెద్దగా సాగలేదు. మరోవైపు అంగన్‌వాడీలనే బలోపేతం చేసేదిశగా చర్యలు తీసుకుంటున్నారు.  దీంతో అంగన్‌వాడీలను సక్రమంగా నడపడంతో పాటు తక్కువ సంఖ్యలో పిల్లలు ఉన్న వాటన్నింటినీ ఒకే దగ్గరకు తీసుకురానున్నారు.  సిఎం కెసిఆర్‌ గతంలో చేసిన సూచన మేరకు దీనిపై పిల్లలు తక్కువగా ఉన్న అంగన్‌వాడీలను ప్రైమరీ స్కూళ్లలో విలీనం చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.  దీంతో అధికారులు జిల్లాల్లో పిల్లల సంఖ్య తక్కువగా ఉన్న వాటి వివరాలను సేకరించడంలో నిమగ్నమయ్యారు.  ప్రైవేటులో మాత్రం మూడేళ్లు దాటగానే ఆంగ్ల అక్షరాలు నేర్పిస్తున్నారు. దీంతో తల్లిదండ్రులు సైతం అటువైపే మొగ్గుచూపు తున్నారు. ఒకటో తరగతిలో ప్రైవేటులో చేరిన ఆ విద్యార్థుల పదో తరగతి వరకు ప్రైవేటులోనే కొనసాగుతున్నారు. దీంతో సర్కారు బడుల్లో ఏటా సంఖ్య గణనీయంగా తగ్గిపోతోంది. వీటికి అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం అంగన్‌వాడీలను ప్రాథమిక బడులకు అనుసంధానం చేయడం ద్వారా పిల్లల సంఖ్య పెంచుకోవచ్చనే భావనలో ఉంది.  మండల కేంద్రాలు, పట్టణాల్లోని కాలనీలు, పెద్ద గ్రామాల్లో అంగన్‌వాడీ కేంద్రాలు ఒకటి నుంచి నాలుగు వరకు పనిచేస్తున్నాయి. వీటిల్లో ఒకటి రెండు కేంద్రాల్లో చాలా తక్కువ మంది విద్యార్థులు నమోదవుతున్నారు. ఇలాంటి వాటి వల్ల నిర్వహణ వ్యయం ప్రభుత్వానికి భారంగా మారుతోంది. అద్దెలు, సామగ్రి, వస్తువుల సరఫరా తదితరవాటిని వృథా ఖర్చులుగా భావిస్తున్న సర్కారు విలీన పక్రియకు శ్రీకారం చుట్టింది. ఎక్కడైతే నిబంధనల ప్రకారం తక్కువగా ఉన్నారో వాటిని సవిూప కేంద్రంలో విలీనం చేయనున్నారు. అక్కడి కేంద్రాన్ని లేనిచోట మంజూరుచేస్తారు. ప్రస్తుతం వీటి విలీన పక్రియపై తహసీల్దార్‌, ఎంపీడీఓ, ఎంఈఓ, ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్లతో కూడిన కమిటీని వేసి నిజనిర్ధరణ చేయించనున్నారు. వీరు సమగ్ర వివరాలు సేకరించి ప్రభుత్వానికి నివేదిక సమర్పించాల్సి ఉంటుంది. తదనంతరం ప్రభుత్వం వీటిపై నిర్ణయం తీసుకుంటుంది. బడులకు సవిూపంలో ఉన్న అంగన్‌వాడీకేంద్రాలను మాత్రం అక్కడికి తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ పక్రియ వచ్చే నెల 5తేదీలోపు పూర్తిచేయాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. ఇది పూర్తయితే జూన్‌లో ప్రాథమిక బడుల్లో చిన్నారులకు పూర్వప్రాథమిక తరగతులు ప్రారంభం కానున్నాయి. జూన్‌లో అంగన్‌వాడీల్లో పూర్వప్రాథమిక తరగతులు ప్రారంభించనున్నారు. ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల సంఖ్యను పెంచడానికి సైతం ఇది దోహదం చేయనుందని భావిస్తున్నారు.  ప్రాథమిక పాఠశాలలకు వీటిని అనుసంధానం చేయడం వల్ల కలుగుతుందని భావన.  అంగన్‌వాడీ టీచర్‌తో పాటు ఆయాలు కూడా అక్కడే పనిచేస్తారు. ఈ కేంద్రాల్లో చదువుకునే చిన్నారులు, బాలింతలు, గర్బిణులకు అక్కడే పౌష్టికాహారం అందించనున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఐదేళ్లు నిండిన వారిని ఒకటో తరగతిలో చేర్చుకుంటున్నారు.  అంగన్‌వాడీ కేంద్రాల విలీన పక్రియకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఒక కేంద్రంలో 10మందిలోపు చిన్నారులు, బాలింతలు, గర్భిణులు ఉన్న వాటిని సవిూప అంగన్‌వాడీ కేంద్రాల్లో విలీనం చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. పిల్లల సంఖ్య తక్కువగా ఉండటం అక్కడి కేంద్రంలో ఒక అంగన్‌వాడీ టీచర్‌, ఆయా ఇద్దరు విధులు నిర్వర్తిస్తున్నారు. కొన్ని చోట్ల టీచర్లు అందుబాటులో లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వీరిని సవిూప ప్రాథమిక బడుల్లో విలీనం చేసి పూర్వప్రాథమిక తరగతులు నిర్వహించాలని భావిస్తోంది. ఆటపాటలతో ఆంగ్లం చదువు నేర్పించడంతో పాటు అక్కడి పాఠశాలలోనే ఒకటి నుంచి ఐదో తరగతి వరకు చదివించాలనే ఉద్దేశంతో ఉంది. ఇలా గ్రామాల్లోని అంగన్‌వాడీ కేంద్రాలకు సవిూప బడుల్లో గదులు కేటాయించి తరగతులు కొనసాగేలా చేయనున్నారు.