అంగన్ వాడీలకు రేషన్ షాపుల నుంచే సరుకులు
అధికారులకు మంత్రి తుమ్మల ఆదేశాలు
హైదరాబాద్,ఆగస్టు28 : తెలంగాణలోని అన్ని అంగన్ వాడీ కేంద్రాలకు సెప్టెంబర్ నుంచి చౌక ధరల దుకాణాల నుంచే రేషన్ అందించాలని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. స్థానికంగా ఉన్న స్టాక్ పాయింట్ డిపోల నుంచి కాకుండా రేషన్ షాపుల ద్వారానే ఇవ్వాలన్నారు. వచ్చే నెల నుంచే దీన్ని అమలు చేయాలని చెప్పారు. సోమవారం సచివాలయంలో తన చాంబర్ లో మహిళా శిశు సంక్షేమంపై సవిూక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అంగన్ వాడీ టీచర్లకు నిర్ధేశిరచిన స్టాక్ పాయింట్ నుంచి పిల్లలకు అందించే రైస్ ట్రాన్స్ పోర్టు అవుతోందని, అలాకాకుండా స్థానికంగానే వాటిని ఇవ్వడం ద్వారా వారికి కావాల్సినంత రేషన్ తో పాటు సమయం కూడా ఆదా అవుతుందని మంత్రి చెప్పారు. అలాగే అంగన్ వాడీ టీచర్ బయోమెట్రిక్ ఆధారంగా వారికి రేషన్ అందిస్తారని, ఆయా కేంద్రాల్లో ఉండే పిల్లల సంఖ్య మేరకు రేషన్ అందిస్తామని తెలిపారు. ఇక అంగన్ వాడీ కేంద్రాల్లో పనిజేస్తోన్న 60 సంవత్సరాలు నిండిన అంగన్ వాడీ టీచర్లు, ఆయాలకు వన్ టైమ్ సెటిల్ మెంట్ కింద డబ్బులు అందించనున్నట్టు మంత్రి తుమ్మల వెల్లడించారు. అంగన్ వాడీ టీచర్లకైతే 60 వేలు, ఆయాలకైతే 30 వేల చొప్పున ఇస్తామన్నారు. కొంతమంది అంగన్ వాడీ టీచర్లు, ఆయాలు తమ వయసు సహకరించడం లేదని…తమకు ఏదో రకంగా సాయం చేయాలన్న వారి విజ్జప్తి మేరకే ఇటువంటి నిర్ణయం తీసుకున్నట్టు మంత్రి వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని అంగన్ వాడీ కేంద్రాల్లో ఉన్న ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. అయితే ఆ పక్రియ ఇప్పటికే ప్రారంభించినట్టు అధికారులు మంత్రికి తెలిపారు. మహబూబ్ నగర్ జిల్లాలో అంగన్ వాడీ టీచర్లు, అయాల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చినట్టు వివరించారు. త్వరలోనే అన్ని జి?ల్లాలో ఉన్న ఖాళీల మేరకు నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్టు మంత్రి తుమ్మలకు తెలిపారు. అంగన్ వాడీ కేంద్రాల్లో ఖాళీలు వెంటనే భర్తీ చేయడంతో పాటు, ఆ పక్రియను వీలైనంత త్వరగా ముగించాలని మంత్రి ఆదేశించారు. అలాగే ఆ పక్రియ అంతా కూడా ఎక్కడా పైరవీలకు తావు లేకుండా ఆన్ లైన్ లో జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. .తద్వారా నిజమైన అర్హులకే ఆ పోస్టులు దక్కేలా చూడాలని మంత్రి తుమ్మల ఆదేశించారు.
కొత్తగా 300 అంగన్ వాడీ మోడల్ భవనాలు..
రాష్ట్రంలో వెనకబడిన ప్రాంతాల్లో కొత్తగా 300 అంగన్ వాడీ మోడల్ భవనాలను నిర్మించనున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. వీటిని నిర్మించేందుకు వేదాంత ఫౌండేషన్ ముందుకొచ్చినట్టు మంత్రి వెల్లడించారు. మొత్తం 11 రాష్టాల్ల్రో నాలుగు వేల భవనాలను నిర్మించేందుకు కేంద్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కూడా చేసుకుందన్నారు. రాష్ట్రంలో కూడా 300 అంగన్ వాడీ భవనాలకు సంబంధించిన భూములను వారికి అప్పగించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ప్రస్తుతం అన్ని అంగన్ వాడీ కేంద్రాలు స్థానికంగా ఉన్నప్రైమరీ పాఠశాలల్లో నడుస్తున్నాయి. అక్కడే ఈ కొత్త భవనాలకు అవసరమయ్యే స్థలాన్ని వేదాంత ఫౌండేషన్ వారికి వెంటనే అప్పగించాలని మంత్రి ఆదేశించారు. ఈ మొత్తం పక్రియను పదిహేను రోజుల్లో పూర్తి చేయాలన్నారు. ఈ మోడల్ అంగన్ వాడీ భవనాలు 704 ఎస్ ఎఫ్ టీ విస్తీర్ణంలో నిర్మించనున్నారు.