అంగవైకల్యం శాపం కాదు పాలకుల నిర్లక్ష్యమే
ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయండి
వికలాంగుల సభలో వక్తల డిమాండ్
హైదరాబాద్, ఆగస్టు 28 (జనంసాక్షి) : అంగవైకల్యం శాపం కాదు, పాలకుల నిర్లక్ష్యానికి సాక్ష్యమని వికలాంగులు నిర్వహించిన రాజ్యాధికార సభ పేరిట మంగళవారం నిర్వహించిన బహిరంగ సమావేశంలో పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమానికి టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, టీఆర్‌ఎస్‌ఎల్పీ నేత ఈటెల రాజేందర్, మాల మహానాడు వ్యవస్థాపకుడు మంద కృష్ణ మాదిగ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి తదితర ప్రముఖులు హాజరై వికలాంగుల సభకు మద్దతు తెలుపుతూ ప్రసంగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వికలాంగుల సమస్యలు పరిష్కారం కావాలంటే వారికి ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. పాలకుల నిర్లక్ష్యం వల్లనే వికలాంగులకు సంక్షేమ పథకాలు అందడం లేదని వెల్లడించారు. అందుకు వారి కోసం ప్రత్యేక కమిషన్‌ను కూడా ఏర్పాటు చేయాల్సిన అవసరమున్నదని అభిప్రాయపడ్డారు. పంచాయతీ ఎన్నికల నుంచి పార్లమెంట్ ఎన్నికల వరకు వికలాంగులకు 7 శాతం రిజర్వేషన్లు కల్పించాలని, విద్య, ఉపాధి రంగాల్లో ఉన్న వికలాంగుల రిజర్వేషన్‌ను 3 నుంచి 7 శాతానికి పెంచాలని డిమాండ్ చేశారు. జవహర్ లాల్ నెహ్రూ పట్టణ పునర్ నవీకరణ పథకం కింద నిర్మితమవుతున్న ఇళ్లలో వికలాంగులకు 3 శాతం కేటాయించాలని, ఆ దిశగా అన్ని ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థలు కృషి చేయాలని వక్తలు విజ్ఞప్తి చేశారు. వికలాంగులకు ఉపసంహరించిన అన్ని పింఛన్లను పునరుద్ధరించాలని, రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న వికలాంగుల పింఛన్‌ను 2 వేలకు పెంచాలని ప్రభుత్వాన్ని కోరారు.