అంటురోగాలే అసలు సమస్యలు
విజయవాడ,జూన్23(జనం సాక్షి): ముసురుతో ముంచుకొచ్చే నానా రకాల అంటురోగాల బారినుంచి ప్రజల్ని కాపాడుకోవాల్సిన తరుణమిది. ఇందుకోసం వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తంగా పనిచేయాల్సి ఉంది.అంటువ్యాధుల ముట్టడిని కాచుకోవాలంటే, సర్కారీ యంత్రాంగాల మధ్య సమన్వయ సాధన ఉండాలి. లోతట్టు ప్రాంతాల్లో పారిశుద్ధ్య సమస్యల కరాణంగా వ్యాధులు ప్రబలే పెనుముప్పు పొంచి ఉంది. వరద బాధిత ప్రాంతాల్లో తక్షణ సహాయచర్యలను వేగవంతం చేస్తూనే అంటువ్యాధుల బారిన పడకుండా ప్రజలను కాపాడుకోవాలి. ఎక్కడ ఏ మేరకు పాలు, నీళ్లు, మందులు, ఆహారం నిల్వ చేయగల వీలుందో గుర్తించి చకచకా ఏర్పాట్లను చేసుకోవాలి. గ్రామాల్లో పారిశుధ్య లోపాలను ప్రజలు ఎప్పికప్పుడు గుర్తించి స్వచ్ఛతకు పాటుపడాలని అధికారులు సూచించారు. పారిశుధ్య పనులపై ప్రత్యేక దృష్టిసారించేలా పారిశుధ్య పనులను చేపడుతున్నప్పటికీ పరిస్థితి యధావిధిగా ఉండటంతో గ్రామస్తులు ప్రైవేటు వైద్యశాలలకు పరుగులు పెడుతున్నారు. జ్వరాల బారిన పడిన వారి వివరాలను ఎప్పటికప్పుడు వైద్యసిబ్బందికి తెలపాలని, వాటి ద్వారా మెరుగైన వైద్యసదుపాయాలు అందిస్తామన్నారు. డెంగ్యూ దోమల నివారణ సాధ్యం కావడం లేదని చెప్పారు. ఎక్కువగా మంచినీటి నిల్వల్లోను, గాబుల్లోను, వాటర్ నిల్వ ప్రాంతాల్లో, టైర్లు, లెట్రిన్‌పైపుల్లో ఈ దోమలు పెరిగిపోవడం వల్లనే డెంగ్యూ ప్రభలుతుందని తెలిపారు. గ్రామంలోని ప్రతిఒక్కరూ బాధ్యతతో వ్యవహరిస్తూ నీటి నిల్వలను తొలగించి లార్వా పెరగకుండా నీటి నిల్వలను తొలగించడం అందరి బాధ్యత అని పేర్కొన్నారు.