అంటువ్యాధుల నివారణకు చర్యలు తీసుకోవాలి

కరీంనగర్‌,ఆగస్ట్‌17(జనంసాక్షి): వర్షాల కారణంగా గిరిజన  మండలాల్లో విష జ్వరాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఏటా ఈ సీజన్‌లో జ్వరాలు ప్రబలుతున్నా అధికారులుపెద్దగా పట్టించుకోవడం లేదు. తూతూ మంత్రంగా చర్యలు తీసుకోవడం వల్లనే ఇలా జరగుతోందని మాజీమంత్రి శ్రీధర్‌ బాబు అన్నారు. పారిశుద్ధ్య లోపం, తాగునీరు, దోమల సమస్యలతో విషజ్వరాలు ప్రబలి పలువురు మంచాన పడుతున్నారని  తెలిపారు. ప్రజలకు అవగాహనలోపంతో విషజ్వరాల తీవ్రత పెరిగిపోయినట్లు పేర్కొన్నారు.  ప్రత్యేక వైద్యశిబిరాలను ఏర్పాటుచేయాలన్నారు. ఇదిలావుంటే కలెక్టర్‌ ఈ గ్రామల్లో పర్యటించి పరిస్థితిని ప్రత్యక్షంగా పరిశీలించాలని అన్నారు.  గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. ప్రత్యేకంగా పారిశుద్ద్యం, తాగునీటి క్లోరినేషన్‌ చర్యలు చేపట్టాలని పంచాయతీ అధికారులను ఆదేశించారు.  అవసరమైన వైద్యులను, సిబ్బందిని ఇతర ప్రాంతాల నుంచి డిప్యూటేషన్‌ వేసి ప్రత్యేక వైద్య సేవలు అందించాలని జిల్లా వైద్యాధికారికి సూచించారు.ఈ ప్రాంతంలో ప్రబలుతున్న విషజ్వరాలపై  అత్యవసర చికిత్స అవసరమయితే జిల్లా కేంద్రాలకు తరలించి ప్రత్యేక్ష పర్యవేక్షణలో మెరుగైన వైద్యం అందించాలని అన్నారు. వ్యక్తిగత శుభ్రతతోపాటు చుట్టూ పరిసరాలు శుభ్రంగా ఉంచే బాధ్యత అందరిపైన ఉందని అధికారులు అన్నారు.