అంతా కలసికట్టుగా ముందుకు సాగాలి
పార్టీ శ్రేణులకు మంత్రి దిశానిర్దేశం
నిర్మల్,ఫిబ్రవరి25(జనంసాక్షి): రానున్న ఎన్నికలను ఎదుర్కొనేందుకు పార్టీ శ్రేణులు సమాయత్తం కావాలని పార్లమెంట్, స్థానిక సంస్థల ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ గెలుపే లక్ష్యంగా పని చేయాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ, న్యాయశాఖల మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. రానున్న రోజుల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటిస్తారని ఈసందర్భంగా జిల్లాలో పార్టీ పరిస్థితిపై చర్చిస్తామన్నారు.మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి ఉమ్మడి జిల్లా ఎంపీ, ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎంపీ నగేశ్, మాజీ మంత్రి జోగు రామన్న, ఎమ్మెల్యేలు కోనేరు కోనప్ప, దివాకర్‌రావు, విఠల్‌రెడ్డి, బాల్క సుమాన్, రేఖశ్యాంనాయక్, దుర్గం చిన్నయ్య తదితరులు పాల్గొన్నారు. పార్లమెంట్, స్థానిక సంస్థల ఎన్నికలైన ఎంపీటీసీ, జడ్పీటీసీ, సహకార సంఘం, మున్సిపల్ ఎన్నికలకు పార్టీని సమాయత్తం చేసేందుకు చేపట్టాల్సిన చర్యల గురించి చర్చించారు. అసెంబ్లీ సమావేశాల తర్వాత నాయకులందరూ వారి వారి నియోజకవర్గాల్లో ఉండాలని సీఎం కేసీఆర్ ఆదేశించిన నేపథ్యంలో నాయకులు మొత్తం నియోజకవర్గం అంటి పెట్టుకుని ఎన్నికలకు సిద్ధం కావాల్సి ఉందని మంత్రి పేర్కొన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు వివరించడం, పార్టీ కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ ఇప్పటి నుంచే నియోజకవర్గాల వారీగా పార్టీని మరింత బలోపేతం చేయడం, పార్టీ నిర్వహిస్తున్న సభ్యత్వ నమోదు కార్యక్రమంపై అందరు నేతలు దృష్టిసారించాలని సూచించారు.