అంబేద్కర్‌ నగర్‌ నుంచి

లోక్‌సభ బరిలోకి మాయావతి?
లక్నో, జులై11(జ‌నం సాక్షి) : సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో బీఎస్పీ చీఫ్‌ మాయావతి స్పీడ్‌ పెంచారు. గోరఖ్‌పూర్‌, ఫుల్పూర్‌ సహా ఇటీవల జరిగిన లోక్‌సభ ఉపఎన్నికల్లో బీజేపీని చిత్తుగా ఓడించడంతో… సరికొత్త రాజకీయ వ్యూహాలకు పదును పెడుతున్నారు. 15 ఏళ్ల తర్వాత మళ్లీ తనకు బాగా అచ్చొచ్చిన అంబేద్కర్‌ నగర్‌ నుంచి లోక్‌సభ బరిలోకి దిగేందుకు ఆమె సిద్ధమైనట్టు సమాచారం. ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడం ద్వారా పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపడంతో పాటు.. ప్రత్యర్థి పార్టీ బీజేపీకి గట్టి సందేశం ఇచ్చేందుకే మాయావతి ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెబుతున్నారు. ఇక్కడి నుంచి బరిలో దిగితే బాగుంటుందన్న దానిపై మాయావతి కసరత్తు చేస్తున్నారని సమాచారం. అంబేద్కర్‌ నగర్‌, బిజ్నోర్‌ స్థానాలను ఇప్పటికే ఖరారు చేశారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. సుదీర్ఘకాలం పాటు యూపీలో ప్రత్యర్థులుగా కొనసాగిన ఎస్పీ-బీఎస్పీ పార్టీలు  ఇప్పుడు జట్టుకట్టి బీజేపీకి బలమైన పోటీ ఇస్తుండడంతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. ఇటీవల రెండు రోజుల పర్యటన నిమిత్తం ఉత్తరప్రదేశ్‌ వచ్చిన బీజేపీ చీఫ్‌ అమిత్‌ షా.. ఎస్పీ-బీఎస్పీ చీఫ్‌ ఎన్నికల వ్యూహంపై దృష్టిపెట్టాల్సిందిగా పార్టీ నేతలు, బీజేపీ సోషల్‌ విూడియా విభాగాలకు సూచించినట్టు సమాచారం. 2004 తర్వాత బీఎస్పీ చీఫ్‌ మాయావతి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీచేయలేదు. 2003లో ఆమె బీఎస్పీ జాతీయ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించారు. ఇక అప్పట్నుంచి ఆమె రాష్ట్రంలోనూ, కేంద్రంలోనూ రాజ్యసభ, మండలి వైపే మొగ్గుచూపుతూ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీచేయలేదు. 2007లో యూపీలో బీఎస్పీ అధికారంలోకి రావడంతో ఆమె మండలిలోకి అడుగుపెట్టి సీఎం పదవి చేపట్టారు. అనంతరం 2012లో రాజ్యసభ సభ్యురాలిగా ఎన్నికయ్యారు. గతేడాది జూలై వరకు రాజ్యసభలో కొనసాగిన మాయావతి, నిరసన పేరుతో రాజ్యసభ సభ్యత్వాన్ని అర్థాంతరంగా వదిలిపెట్టారు.