అకాల వర్షాలతో మామిడి దిగుబడులపై ప్రభావం
ఆదిలాబాద్,మే7(జనంసాక్షి): రాష్ట్ర ప్రభుత్వం బెల్లంపల్లి వ్యవసాయ మార్కెట్‌కు అనుబంధంగా ప్రత్యేకంగా మామిడి విక్రయ కేంద్రాన్ని ప్రారంభించినా ఈ యేడు పంట దిగుబడులు ఆందోళనకరంగా ఉన్నాయి. గతేడాది చేపట్టిన చర్యల కారణంగా ఈ యేడు కూడా మంచి ఫలితాలు వస్తాయని ఆశిస్తున్నారు. అయితే అకాల వర్షాల కారణంగా మామిడి బాగా దెబ్బతిన్నది. పంట దిగుబడి తగ్గలదని రైతులు చెబుతున్నారు. మార్కెట్ యార్డు ఆధ్వర్యంలోనే ప్రత్యేకంగా మామిడి విక్రయ కేంద్రం ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య చేసిన ప్రయత్నం ఫలించింది. బెల్లంపల్లి మార్కెట్ యార్డుకు అనుబంధంగా మామిడి పండ్ల విక్రయ కేంద్రం నిర్మాణం కోసం 10 ఎకరాల ప్రభుత్వ స్థలం కేటాయించిందని వ్యవసాయాధికారి వెల్లడించారు. తూర్పు ప్రాంతంలోని బెల్లంపల్లి, సిర్పూరు, చెన్నూరు, మంచిర్యాల, నియోజకవర్గంలోని వివిధ మండలాల్లో సుమారు 60 వేల ఎకరాలకు పైగా మామిడి తోటలున్నాయి. బెల్లంపల్లి నియోజకవర్గంలోనే తాండూరు, బెల్లంపల్లి, నెన్నెల, భీమిని, కాసిపేట మండలాల పరిధిలో 25 వేల ఎకరాలకు పైగా మామిడితోటలున్నాయి. తగిన మార్కెట్ సౌకర్యాలు లేక ఏటా రైతులు దళారులను ఆశ్రయిస్తున్నారు. స్థానిక వ్యాపారులు, లేదా ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారికి తమ తోటలను మందుగానే గుత్తకు ఇస్తున్నారు. రైతులు స్వయంగా మామిడి పండ్లను మహారాష్ట్రకు తీసుకెళ్లి అమ్ముకుంటున్నారు. రవాణా ఖర్చుతో పాటు ఇతర వ్యయం తడిసిమోపెడవుతోంది. ఏప్రిల్, మే నెలల్లో వచ్చే వడగండ్ల వర్షాలకు, గాలిదుమారాలకు తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ నేపథ్యంలో ముందుగానే తక్కువ ధరలకు గుత్తేదారులకు తోటలను అమ్ముకుంటున్నారు. ప్రస్తుతం జిల్లాలోని వివిధ మార్కెట్ యార్డుల్లో గోదాంల నిర్మాణానికి రూ.50 కోట్లు మంజూరయ్యాయి. వీటితో అవసరమైన చోట కొత్తగా గోదాంలను నిర్మిస్తామన్నారు. ఇదే నిధులతో బెల్లంపల్లిలో కూడా మామిడి పండ్ల విక్రయ కేంద్రానికి అవసరమైన గోదాంల నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించామన్నారు. మార్కెట్ యార్డును ఆనుకుని ఉన్న పది ఎకరాల ప్రభుత్వ స్థలం కేటాయించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. దీంతో ఇటీవల వ్యవసాయమార్కెట్‌ను ఆనుకుని నీలగిరి తోట పక్కన ఉన్న పది ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని సర్వేచేసి రెవెన్యూ అధికారులు గుర్తించారు. ఈ స్థలాన్ని మార్కెట్ కమిటీ అధికారులకు అప్పగించారు.. నిధులు అనుమతి రాగానే ఇక్కడ మామిడి విక్రయ కేంద్రం ఏర్పాటుకు శ్రీకారం చుడతాం. దీంతో జిల్లా రైతులతో పాటు ఇతర ప్రాంతాల రైతులు కూడా ఇక్కడే మామిడి పండ్లను విక్రయించుకునే అవకాశం కలుగుతుందన్నారు. ఈ సీజన్‌నాటికి ఇక్కడ అతిపెద్ద మామిడి విక్రయ కేంద్రం ఏర్పాటయ్యే అవకాశం ఉంది. వచ్చే సీజన్‌నాటికి ఇక్కడ అతిపెద్ద మామిడి విక్రయ కేంద్రం ఏర్పాటు అవకాశం ఉంది. రాష్ట్ర మార్కెటింగ్ శాఖ మంత్రి హరీష్ రావు ఆదేశాలతో ప్రతి మండలంలో అయిదు ఎకరాల ప్రభుత్వ స్థలం గుర్తించి నియోజకవర్గంలో ఉండే వ్యవసాయ మార్కెట్ కమిటీలకు అప్పగించాలని ఇటీవల అన్ని మండలాల తహసీల్దార్‌లకు ఆదేశాలు అందాయి. ఆయా మండలాల్లో రైతుల కోసం మార్కెట్ కమిటీ ద్వారా గోదాంలు, ప్లాట్‌ఫారాలు నిర్మిచేందుకు చర్యలు తీసుకుంటారు. మారుమూల మండలాల్లో అన్ని రకాల పంటలు పండించే రైతుల పంటకు ఎంతో రక్షణ ఏర్పడుతుంది. మామిడి పండ్లు మంచి ధరకు విక్రయించుకునేందుకు నిల్వ చేయడానికి శీతల గిడ్డంగులు నిర్మాణం కోసం అధికారులు ప్రతిపాదనలు పంపించాలని రైతులు కోరుతున్నారు. ఈ మామిడి విక్రయ కేంద్రంతో తూర్పు, పశ్చిమ జిల్లా రైతులు పండించిన మామిడి పండ్లు ఇక్కడే అమ్ముకునే వెలుసుబాటు కలుగుతుంది. అన్ని వ్యవసాయమార్కెట్ కమిటీల్లో కొత్త గోదాంల నిర్మాణం కోసం నిధులు మంజూరు చేస్తున్నట్లు ఇటివల ప్రభుత్వం ప్రకటించింది.