అక్బర్‌కు పద్నాలుగురోజుల రిమాండ్
ఆదిలాబాద్ జైలుకు తరలింపు వారం రోజుల కస్టడీని కోరిన పోలీసులు
నిరాకరించిన కోర్టు
ఆదిలాబాద్, జనవరి 9 (జనంసాక్షి):
నిర్మల్ బహిరంగ సభలో రెచ్చగొట్టే ప్రసంగం చేశారనే అభియోగాలపై అరెస్టు అయిన ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీని నిర్మల్ మునిసిఫ్ మేజిస్టేట్ర్ కోర్టు 14 రిమాండ్ విధించింది. దీంతో ఆయనను ఆదిలాబాద్ జిల్లా జైలుకు తరలించారు. అయితే, తాను అనారోగ్యంతో ఉన్నానని, ప్రత్యేక ఖైదీగా ప్రకటించి.. చంచల్‌గూడ జైలు లేదా అత్యాధునిక వైద్య సదుపాయాలు ఉన్న జైలుకు పంపాలని అక్బర్ న్యాయమూర్తికి విజ్ఞప్తి చేశారు. డిసెంబర్ 22న నిర్మల్‌లో నిర్వహించిన బహిరంగ సభలో రెచ్చగొట్టే ప్రసంగం చేశారని అక్బర్‌పై రూరల్ పోలీసులు కేసులు నమోదు చేశారు. సోమవారం తమ ఎదుట హాజరు కావాలని ఆదేశించగా, ఆరోగ్య కారణాలతో తాను హాజరు కాలేకపోతున్నానని, నాలుగు రోజులు గడువు ఇవ్వాలని కోరారు. అయితే, ఆయన ఆరోగ్య పరిస్థితిపై హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించిన పోలీసులు నాటకీయ పరిణామాల మధ్య మంగళవారం సాయంత్రం అక్బరుద్దీన్‌ను అరెస్టు చేశారు. పటిష్ట భద్రత నడుమ రాత్రికి నిర్మల్ రూరల్ పోలీసుస్టేషన్‌కు తరలించారు. దాదాపు నాలుగు గంటల పాటు విచారించిన పోలీసులు.. బుధవారం తెల్లవారుజామున 5.25 గంటల సమయంలో నిర్మల్ మునిసిఫ్ మేజిస్టేట్ర్ అజేశ్‌కుమార్ ఎదుట హాజరు పరిచారు. ఆయనపై అదనంగా ఐపీసీ 121, 153 (ఏ), 120 (బి), 124 (ఏ), 295(ఏ), 505, 188 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి రిమాండ్ రిపోర్టు సమర్పించారు. ఏడు రోజులు కస్టడీకి ఇవ్వాలని కోరారు. అయితే, కస్టడీకి ఇవ్వాలన్న పోలీసుల విజ్ఞప్తిని న్యాయమూర్తి తోసిపుచ్చారు. 14 జ్యుడీషియల్ రిమాండ్ విధిస్తూ.. అక్బర్‌ను ఆదిలాబాద్ జిల్లా జైలుకు తరలించారని ఆదేశించారు. ఒవైసీకి ఆదిలాబాద్‌లోని రాజీవ్‌గాంధీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో వైద్య పరీక్షలు నిర్వహించి నివేదిక సమర్పించాలని సూచించారు. ఇదిలా ఉంటే, అక్బరుద్దీన్‌ను కస్టడీకి ఇవ్వాలని నిర్మల్ కోర్టులో పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. విచారణ సమయంలో అక్బర్ తమకు సహకరించలేదని, అందుకే కస్టడీకి కోరుతున్నట్లు పిటిషన్‌లో పేర్కొన్నారు. తదుపరి విచారణ నిమిత్తం నిందితుడిని తమ కస్టడీకి ఇవ్వాలని న్యాయమూర్తిని కోరినట్లు జిల్లా ఎస్పీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి వెల్లడించారు. జిల్లా జైలులో ఉన్న అక్బరుద్దీన్ వైద్య సదుపాయం కల్పిస్తామని కరీంనగర్ రేంజ్ డీఐజీ బీమానాయక్ తెలిపారు. జైలులో అక్బర్‌ను సాధారణ ఖైదీగానే పరిగణిస్తున్నామని చెప్పారు. ఆదిలాబాద్ జిల్లాలో భైంసా మినహా ఎక్కడా బంద్ ప్రభావం లేదన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా భద్రతా ఏర్పాట్లు చేశామని చెప్పారు.
8 గంటలు స్టేషన్లోనే…
మంగళవారం రాత్రి 9.45 గంటలకు నిర్మల్ పోలీసుస్టేషన్‌కు చేరుకున్న ఎమ్మెల్యే ఒవైసా దాదాపు 8 గంటల పాటు పోలీసుస్టేషన్‌లోనే ఉన్నారు. 10.30 గంటలకు భోజనం పెట్టిన పోలీసులు, ఆ తర్వాత నాలుగు గంటల పాటు ఏకధాటిగా విచారించారు. 2.30 గంటల సమయంలో నిద్రకు ఉపక్రమించిన అక్బర్‌ను తెల్లవారుజామున 5 గంటల సమయంలో పోలీసులు లేపారు. నేరుగా తీసుకెళ్లి మేజిస్టేట్ర్ ఎదుట హాజరుపరిచారు. అక్బర్ వివాదాస్పద వ్యాఖ్యలపై సుమోటోగా కేసు నమోదు చేసిన పోలీసులు తొలుత 153 (ఏ), 121 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అయితే, వాటికి తోడు అదనంగా 120 (బీ), 124 (ఏ), 505, 295 (ఏ), 188 సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తూ రిమాండ్ రిపోర్టు దాఖలు చేశారు. ఒవైసీ వెంట వచ్చిన ఎమ్మెల్యేలను అనుమతించని న్యాయమూర్తి.. కేవలం ఆయన న్యాయవాదిని మాత్రమే అనుమతించారు. అనంతరం రిమాండ్‌కు తరలించాలని న్యాయమూర్తి కుమార్ ఆదేశించడంతో… పోలీసులు ఆయన్ను ఆదిలాబాద్‌కు తీసుకెళ్లారు. సుమారు 80 కిలోవిూటర్ల దూరంలో ఉన్న ఆదిలాబాద్‌కు తరలించేందుకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. భారీ కాన్వాయ్‌తో బయల్దేరిన పోలీసులు ఉదయం 7.30 గంటల సమయంలో అక్బర్‌ను జిల్లా జైలుకు చేర్చారు. మరోవైపు, అక్బర్ వెంట ఉన్న ఎంఐఎం ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్, ఎమ్మెల్సీలు అఫ్సర్ ఖాన్, రసూల్‌ఖాన్‌లను పోలీసులు ఆదిలాబాద్‌లోకి అనుమతించ లేదు. అక్బర్ కాన్వాయ్ వెంట బయల్దేరిన వారిని ఆదిలాబాద్ బైపాస్ రోడ్డు వద్దనున్న మావల గ్రామం వద్ద నిలిపివేశారు.
ఇదిలా ఉంటే, అక్బర్ అరెస్టును నిరసిస్తూ ఎంఐఎం ఆదిలాబాద్ జిల్లా బంద్‌కు పిలుపునిచ్చిన నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా పటిష్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ప్రధానంగా సున్నితమైన, అత్యంత సున్నితమైన ప్రాంతాల్లో అదనపు బలగాలు మోహరించారు. భైంసా, నిర్మల్, ఇచ్చోడా, ఖానాపూర్, ఆదిలాబాద్‌లలో గట్టి నిఘా పెట్టారు. అదనపు పెట్రోలింగ్ వాహనాలు ఏర్పాటు చేశారు.
నిర్మల్ కోర్టు వద్ద ఉద్రిక్తత..
ఇదిలా ఉంటే, అక్బర్‌ను జిల్లా జైలుకు తరలించారని తెలుసుకున్న ఎంఐఎం కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో నిర్మల్ కోర్టు వద్దకు తరలివచ్చారు. పోలీసులపై రాళ్లు రువ్వారు. పోలీసులు వారిపై లాఠీచార్జి చేసి, చెదరగొట్టారు. దీంతో ఆందోళనకారులు విధ్వంసానికి దిగారు. జాతీయ విూడియా వ్యాన్లపై దాడి చేశారు. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది.