అక్రమణ చెరలో దేవాలయ భూములు

కోట్లు విలువ చేసే భూములకు ప్రైవేట్‌ పట్టాలు
కదలని దేవాదాయ శాఖ అధికారులు
సూర్యాపేట,ఫిబ్రవరి21(ఆర్‌ఎన్‌ఎ): జిల్లాలో అనేక దేవాలయ భూములు ఆక్రమణకు గురయ్యాయి. కౌలుకు తీసుకున్న వారు కూడా చెల్లించడంలేదు. అలాగే అధికారులు కూడా గట్టిగా చర్యలు తీసుకోవడం లేదు. ఇంత జరుగుతన్నా దేవాదాయ శాఖ అధికారుల దృష్టి పెట్టడం లేదు. సర్వే నంబర్లు మార్చి రైతుబంధు సహా అనేక పథకాలు పొందుతున్నారు. దేవాదాయ భూముల పక్కనే ఉన్న సర్వే నెంబర్‌ వేసి రిజిస్టేష్రన్‌ చేయించుకొని రైతుబంధు పథకం కూడా పొందుతున్నారు. భూములను స్వాధీనంచేస్తే ఆయా దేవాలయాల్లో దూప, దీప నైవేద్యాలతో పాటు మహోత్సవాలను నిర్వహించేందుకు అవకాశం లభిస్తుందని పూజారులు ఆశపడుతున్నారు. ఆత్మకూర్‌(ఎస్‌) మండలం కందగట్ల లక్ష్మీనర్సింహ్మస్వామి దేవాలయం పరిధిలో 654 ఎకరాల భూమి ఉంది. ముందుగా కౌలుకు చేశారు. ఆ తర్వాత కౌలు చెల్లించడం మానేశారు.ఏకంగా పక్కా భూముల సర్వే నెంబర్‌ వేసి రిజిస్టేష్రన్‌ చేయించుకున్నారు. దేవాలయం మొత్తం
శిథిలావస్థకు చేరింది. అక్కడ దేవాలయ భూములను పరిరక్షించే వారు కరువయ్యారు. అర్వపల్లి మండల కేంద్రంలోని యోగానంద లక్ష్మీనర్సింహ్మస్వామి ఆలయం పరిధిలో 750 ఎకరాల భూమి ఉండగా 650 ఎకరాల భూమి కౌలుకు తీసుకొని సేద్యం చేస్తున్నారు. సంవత్సరానికి రూ.500 మాత్రమే చెల్లించి కౌలు చేస్తున్నారు. మరో 100 ఎకరాలు అక్రమణకు గురయ్యాయి. ఎంతోమంది ఇళ్లు కట్టుకొని నివాసముం టున్నారు. రిజిస్టేష్రన్లు కూడా మారిపోయాయి. మోతె మండలం ఉండ్రుగొండ లక్ష్మీనర్సింహ్మస్వామి దేవాలయం కింద 100కు పైగా ఎకరాలు ఉండేది. కౌలుకు తీసుకున్న వారు ఏకంగా ఆక్రమించుకున్నారు. మద్దిరాల మండలం గోరెంట్ల వేంకటేశ్వరస్వామి, శివాలయాల కింద 150 ఎకరాల భూమి ఉంటే సుమారు 30 ఎకరాల భూమి అన్యాక్రాంతమైంది. నాగారం మండలంలోని ఫణిగిరి లక్ష్మీనర్సింహ్మాస్వామి దేవాలయం, శ్రీరామ ఆలయానికి సంబంధించిన భూముల ను కూడా పట్టాలు చేసుకున్నట్లు సమాచారం. చివ్వెంల మండలం దురాజ్‌పల్లి లింగమంతుల స్వామి గుడి కింద 26 ఎకరాల దేవాలయ భూమి ఉండగా 15 గుంటలు సబ్‌స్టేషన్‌ నిర్మాణానికి అందజేశారు. అది పోనూ మిగిలిన భూమిలో 5 ఎకరాల దాకా అన్యాక్రాంతమైనట్లు తెలుస్తుంది. చివ్వెంల మండలం ఉండ్రుగొండ ఫారెస్టు భూమి 2వేల ఎకరాలకు పైగా ఉండగా 100 ఎకరాల దాకా చుట్టు పక్కలా వారు అక్రమించు కున్నారు. పెన్‌పహాడ్‌ మండలంలోని నాగులపహాడ్‌ త్రికుఠేశ్వర దేవాలయం కింద 4 ఎకరాల భూమి ఉండాల్సి ఉంది. కేవలం ఎకరం మాత్రమే ఉంది. పక్కా రైతులు అక్రమించుకొని పట్టాలు చేయించు కున్నారు. హుజుర్‌నగర్‌ మండలం బూరుగడ్డ గ్రామంలోని వేణుగోపాలస్వామి దేవాలయం పరిధిలో 650 ఎకరాలుంటే 350 మంది రైతులు సేద్యం చేస్తున్నారు. ఎకరానికి రైతులు రూ.3వేలు కౌలు చెల్లిస్తున్నారు. దీనిలో కూడా 100 ఎకరాలు అన్యాక్రాంత మైనట్లు తెలుస్తుంది. మోతె మండలంలోని ఉర్లుగొండ లక్ష్మీనర్సింహ్మాస్వామి దేవాలయం పరిధిలో 80 ఎకరాల భూమి ఉండాలి. 15 ఎకరాల భూమి అన్యాక్రాంత మైంది. ఎస్సారెస్పీ కాల్వల కింద 6 ఎకరాల భూమి పోయింది. కౌలు కూడా కొంత మంది చెల్లించడం లేదని తెలుస్తుంది. అయితే వరుసగా విమర్శలు రావడంతో దేవాదాయ శాఖ ఇప్పుడిప్పుడే మేల్కొంటుంది. కబ్జాకు గురైన భూములను సంరక్షించు కోవాలని రాష్ట్ర వ్యాప్తంగా చర్యలు చేపట్టింది. దేవాలయాల సవిూపంలో భూముల సర్వే నెంబర్లు బోర్డులపై రాసే కార్యక్రమం కొనసాగుతుంది. అక్రమించుకున్న వారు భూములను ఇవ్వకుంటే ఎండోమెంట్‌ ట్రిబ్యునల్‌ కోర్టుల్లో కేసులు నమోదు చేయాలని స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు.

తాజావార్తలు