అక్రమాలకు అడ్డు తగులుతున్నాననే..
తనపై చీర దొంగముద్ర
– తన నిజాయితీని నిరూపించుకొనేందుకు ఎంతదూరమైనా వెళ్తా
– దుర్గ గుడిలో పనిచేసే మహిళలపై లైంగిక వేధింపులు
– విలేకరుల సమావేశంలో పాలక మండలి మాజీ సభ్యురాలు కోడెల సూర్యలత
విజయవాడ, ఆగస్టు18(జనం సాక్షి) : కనకదుర్గమ్మ ఆలయంలో కొంతమంది సిబ్బంది అవినీతికి అడ్డు తగులుతున్నందునే తనపై చీర దొంగ ముద్ర వేశారని దుర్గగుడి పాలకమండలి మాజీ సభ్యురాలు కోడెల సూర్యలత ఆరోపించారు. విజయవాడలోని ప్రెస్‌క్లబ్‌లో శనివారం సూర్యలత విూడియా సమావేశంలో మాట్లాడారు. పాలకమండలి సభ్యురాలిగా అమ్మవారికి సేవ చేస్తున్న తనపై కొంతమంది కావాలని కుట్రలు పన్నారని ఆరోపించారు. అమ్మవారి ఆలయంలో అన్ని పారదర్శకంగా ఉండాలన్న ఉద్దేశంతో సేవలన్నింటినీ కంప్యూటరీకరణ చేయాలనీ పాలకమండలికి తాను సూచించినట్లు చెప్పారు. ఆలయంలో జరుగుతున్న అక్రమాలపై ఈవో దృష్టికి తీసుకెళ్లినందునే కొందరు తనపై కక్ష సాధించారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తన నిజాయతీని నిరూపించుకునేందుకు ఎంత దూరమైనా వెళ్తానని.. ఎలాంటి విచారణకైనా సిద్ధమని ఆమె స్పష్టం చేశారు. దుర్గగుడిలో ఓపీడిఎస్‌కు చెందిన మహిళలపై లైంగిక వేధింపులు జరుగుతున్నాయని ఆమె ఆరోపించారు. పాలక మండలి సభ్యులు వెలగపూడి శంకరబాబు గుడిలో పనిచేసే మహిళలను వేధింపులకు గురిచేస్తున్నారన్నారు. గతంలో బాధిత మహిళలు శంకరబాబుపై ఫిర్యాదు చేసినా చైర్మన్ గౌరంబాబు ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలిపారు. ఫిర్యాదులను గౌరంబాబు పట్టించుకోకపోవడమే కాకుండా శంకరబాబును వెనకేసుకొచ్చేవాడని మండిపడ్డారు. ఆలయ అభివృద్ది పనుల్లో భాగంగా సీసీ రోడ్, ఘాట్‌రోడ్ టెండర్లలో అక్రమాలు జరిగాయని ఆమె ఆరోపించారు. చైర్మన్ అక్రమాలను వ్యతిరేకించినందుకే తనపై కక్ష్య కట్టారని పేర్కొన్నారు. చీరల విషయంలో లక్షల అక్రమాలు జరిగాయని, వాటిని ప్రశ్నించినందుకు తనను చీరల దొంగగా చిత్రీకరించారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాథమిక దర్యాప్తు జరపకుండానే తనను తొలిగించారని, తాను ఏ తప్పు చేయలేదని సూర్యలత స్పష్టంచేశారు. తన నిజాయితీని నిరూపించుకొనేందుకు ఎంతదూరమైనా వెళ్తానని స్పష్టం చేశారు.