అక్రమాలు బయటపెడితే ప్రాణాలు తీస్తారా? 

– నాగరిక రాజ్యమా? కరడుగట్టిన కాలకేయ రాజ్యమా?
– పేపర్‌ లీకేజీపై విచారణ చేపట్టాలి
– ట్విటర్‌లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు
అమరావతి, సెప్టెంబర్‌24 జనం సాక్షి  :  వైసీపీ ప్రభుత్వం తీరుపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు నిప్పులు చెరిగారు. వైసీపీ పాలనలో అక్రమాలు బయటపెడితే ప్రాణాలు పోయే పరిస్థితి ఉందని, అందుకు ఉదాహరణ చీరాల విలేకరిపై జరిగిన దాడి అని అన్నారు. వైసీపీ ప్రభుత్వ తీరుపై మండిపడుతూ మంగళవారం చంద్రబాబు వరుస ట్వీట్లు చేశారు. చీరాల విలేకరి నాగార్జున రెడ్డిపై వైసీపీ నేతలు చేసిన దాడి అమానుషమని, అక్రమాలు బయటపెడితే కక్షగడతారా? పదేపదే దాడి చేస్తారా? ఎస్పీకి వినతి పత్రం ఇచ్చి వస్తుంటే దాడి చేశారంటే పోలీసులు ఏం చేస్తున్నారంని ప్రశ్నించారు. ఇంతకుముందు కూడా మరో వైసీపీ నేత, పాత్రికేయుని ఇంటికి వెళ్ళి ప్రాణాలు తీస్తామని బెదిరించి వచ్చారని ఆరోపించారు. ముఖ్యమంత్రేమో తన దొంగ పత్రిక సాక్షి తప్ప మరో పత్రిక ఉండకూడదంటారు. ఏమిటీ నిరంకుశత్వం? ఇది నాగరిక రాజ్యమా? కరడుగట్టిన కాలకేయ రాజ్యమా? అని విరుచుకుపడ్డారు. అదేవిధంగా పేపర్‌ లీకేజీపై ట్వీట్‌లో చంద్రబాబు ప్రశ్నించారు. ఏపీలో గ్రామ సచివాలయ పరీక్ష పేపర్ల లీకేజీ వ్యవహారంపై అటు ప్రభుత్వం గానీ, పంచాయతీరాజ్‌ శాఖ గానీ వివరణ ఇవ్వకపోవడంపై మండిపడ్డారు. ఈ విషయమై ప్రభుత్వంగానీ, పంచాయతీ రాజ్‌ శాఖగానీ ఇంతవరకు నోరు విప్పడం లేదని విమర్శించారు. ఏపీపీఎస్సీని అడిగితే పరీక్షలను తాము నిర్వహించలేదని, తమకు ఎటువంటి సంబంధం లేదని అంటోందని, 18లక్షల మంది భవిష్యత్తుతో ఏమిటీ నాటకాలు అంటూ ప్రశ్నించారు. ఈ అవకతవకలపై ప్రశ్నిస్తున్న తమను టీడీపీ ఓర్వలేకపోతుందని అంటారా అని ప్రశ్నించారు. అంత ఓర్వలేకపోవడానికి విూరు చేసిన ఘనకార్యాలేమిటని చంద్రబాబు ప్రశ్నించారు. విూరు గడ్డితినడం చూసి, నీతిమాలిన పనులు చూసి అసూయపడాలా అని ప్రశ్నించారు. ఈ స్కామ్‌ పై విచారణ చేయించాలని, యువతకు చేసిన అన్యాయాన్నిఎట్టిపరిస్థితుల్లోనూ సహించమని హెచ్చరించారు.
ఇంతకీ ఈ పరీక్ష నిర్వహించింది ఎవరు? : నారా లోకేశ్‌
ఇదే విషయమై టీడీపీ నేత నారా లోకేశ్‌ కూడా విమర్శలు చేశారు. పరీక్ష తాము నిర్వహించలేదని, ఈ స్కామ్‌ కి తమకు సంబంధం లేదని ఏపీపీఎస్సీ అంటోందని, మంత్రులు మాత్రం ఏపీపీఎస్సీనే నిర్వహించిందని అంటున్నారని అన్నారు. ఇంతకీ ఈ పరీక్ష నిర్వహించింది ఎవరు అంటూ ప్రశ్నించారు. 18 లక్షల మంది యువత భవిష్యత్తుతో ఆటలు ఆడుతున్నారా అని లోకేశ్‌ వరుస ట్వీట్లులో వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పరీక్షలు నిర్వహించింది ఎవరు అనేది తెలియదు కానీ, పేపర్‌ లీకేజీ స్కామ్‌ కి తండ్రి మాత్రం వైఎస్‌ జగనే అని ఆరోపణలు చేశారు. ఎంతైనా, చిన్న వయసులోనే జగన్‌ లీక్‌ వీరుడు కదా! ఇప్పుడు పేపర్లు లీక్‌ అవ్వడంలో పెద్ద విచిత్రం ఏవిూ లేదంటూ జగన్‌ పై విమర్శలు చేశారు.