అక్రమ ఇసుక ర్యాంపులపై కఠినచర్యలు: ఎస్పీ

ఏలూరు,జూన్‌13(జ‌నం సాక్షి): నిబంధనలను ఉల్లంఘించి ఎవరైనా అక్రమంగా ఇసుకను రవాణా చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్‌పి హెచ్చరించారు. ప్రభుత్వ నిబంధనల మేరకు ఎవరూ కూడా అనుమతులు లేకుండా ఇసుక రవాణా చేయకూడదన్నారు. ఒక వేళ ఎవరైనా ఇసుకను అక్రమంగా రవాణా చేసినట్లు దృష్టికి వస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. ర్యాంపులలో పెద్ద పెద్ద యంత్రాలను ఉపయోగించి ఇసుకను లోడ్‌ చేసినా, ప్రభుత్వం నిర్దేశించిన దానికంటే ఎక్కువ డబ్బులను వసూలు చేసినా కూడా ఉపేక్షించమని అన్నారు. ఇసుక ర్యాంపుల వద్ద ఆధిపత్యం కోసం ప్రయత్నించినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎక్కడైనా ఇలాంటివి జరిగితే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. ఇటీవల ఉచిత ఇసుక ప్రకటనకు ముందు.. ఆ తర్వాత సైతం జిల్లాలో ఇసుక మాఫియాను మితివిూరి వ్యాపారానికి ఒడిగడుతోంది. నిబంధనలకు విరుద్ధంగా జిల్లావ్యాప్తంగా ఇష్టానుసారంగా యంత్రాలతో ఇసుక తవ్వకాలు సాగిపోతున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. దీంతో పోలీస్‌ యంత్రాంగం కూడా కఠిన చర్యలకు ఉపక్రమించింది. నిబంధనలకు విరుద్ధంగా యంత్రాలతో ఇసుకతవ్వకాలు సాగిస్తున్నారంటూ వస్తున్న ఆరోపణలు చర్చనీయాంశమైంది. జిల్లాలో దాదాపు అత్యధిక ఇసుక ర్యాంపుల్లో యంత్రాలతోనే తవ్వకాలు సాగుతున్నాయి. పట్టపగలు బహిరంగంగానే ఈ తంతు సాగుతోంది. తమ్మిలేరులో యంత్రాలతో ఇసుక తవ్వకాలు సాగించడంపై ఇటీవలే స్థానికులు పెద్దఎత్తున ఆందోళన సైతం చేశారు. జల్లేరు జలాశయంలోనూ యంత్రాలతోనే ఇసుక తవ్వేస్తున్నారు. పోలవరంలో మూడు ర్యాంపులు ఉండగా అన్నిచోట్లా ఇదే పరిస్థితి. అయినా ఎక్కడా చర్యలు లేవు.