‘ అఖిలపక్ష ప్రతినిధులను 26,27న ప్రకటిస్తం’ : బొత్స

న్యూఢిల్లీ : తెలంగాణ అంశంపై కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశానికి కాంగ్రెస్‌ పార్టీ తరపున వెళ్లే ప్రతినిధులను ఈ నెల 26,27న ప్రకటిస్తామని పీసీసీ చీఫ్‌ బొత్స సత్యనారాయణ తెలియజేశారు. అఖిలపక్ష సమావేశానికి పార్టీలో ఏకాభిప్రాయం కోసం సమావేశం ఏర్పాటు చేయాల్సిన అవసరంలేదని ఆయన అసహనంతో అన్నారు. మూడు ప్రాంతాలకు చెందిన నేతలు తనను కలిసి వారివారి అభిప్రాయాలు తెలియజేస్తున్నారని బొత్స సత్యనారాయణ తెలియజేశారు.

మిగతా పార్టీలు ముందు తమ అభిప్రాయం చెప్పాలి

తెలంగాణ అంశంపై డిసెంబర్‌ 2న కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశంలో కాంగ్రెస్‌ కన్నా ముందు రాష్ట్రంలోని ఇతర పార్టీలు తమ అభిప్రాయాల్ని తెలియజేయాల్సి ఉంటుందని బొత్స సత్యనారాయణ అన్నారు. కాంగ్రెస్‌ కన్నా ముందు ఇతర పార్టీలు తమ అభిప్రాయాన్ని తెలపాలని ఆయన  అన్నారు. లేకపోతే కాంగ్రెస్‌ నిర్ణయాన్ని సమర్థిస్తామని చెప్పినా చాలని ఆయన వెల్లడించారు.

ప్రొసిక్యూషన్‌కు ప్రభుత్వ అనుమతి అవసరం లేదు : బొత్స

మంత్రి ధర్మాన ప్రసాదరావుకు సంబంధించిన ఫైలు గవర్నర్‌ తిప్పి పంపిన విషయం తనకు తెలియదని, మీడియాలో వస్తున్నా వార్తల ద్వారానే తనకు ఆ విషయం తెలుసునని అన్నారు. అసలు ప్రాసిక్యూషన్‌ నిర్వహించేందుకు సీబీఐకి ప్రభుత్వ అనుమతి అవసరంలేదని, కోర్టుకు వెళ్లిన సీబీఐ మళ్లీ ప్రభుత్వాన్ని ఎందుకు అనుమతి కోరిందని ఆయన ప్రశ్నించారు. సీబీఐ అనుమతి కోరడం వల్లే ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఆయన వివరించారు.