అగమ్య గోచరంలో బిజెపి
నాయకత్వ లోపంతో ఎన్నికల్లో గెలవడం కష్టమే?
హైదరాబాద్,ఆగస్ట్28(జనం సాక్షి): తెలంగాణలో భారతీయ జనతా పార్టీ పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. తెలుగుదేశం పార్టీతో మిత్రత్వాన్ని వదులుకున్నట్టు ఏకపక్షంగా ప్రకటించడంతో ఇక తమతో కలసి వచ్చేపార్టీ లేకుండ ఆపోయింది. బీజేపీ నాయకుల వ్యవహారా శైలి తమకు తాము నష్టం చేసుకున్నట్లుగా ఉంది. తెలుగుదేశం పార్టీతో జతకట్టడం ద్వార ఐదు అసెంబ్లీ, ఓ పార్లమెంట్ స్థానం గెల్చుకోగలిగారు. కానీ ఇప్పుడా పరిస్తితి లేదు. ఉన్న ఐదు సీట్లలో గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పార్టీని వీడారు. కనీసం ఆయననుకూడా బుజ్జగించి పార్టీలో కొనసాగేలా చేసుకోలేకపోయారు. దీంతో వారికి ఈ ఎన్నికలు సవాల్ కానున్నాయ. కనీసం ఉన్న ఐదు సీట్లను కూడా దక్కించుకునే గ్యారెంటీ లేదు. అయినా అధికారంలోకి వచ్చేది తామే అంటూ రంకెలు వేస్తున్నారు. ఎలా అంచానా వేసుకున్నా వారికి సొంతంగా ఓ సీటు గెల్చుకునే అవకాశం లేదనే చెప్పాలి. బిజెపితో టిడిపి తెగదెంపులు జరగడంతో తెలుగుదేశం పార్టీతో పొత్తుకు కాంగ్రెస్ ఉత్సుకత ప్రదర్శిస్తున్నది. వారు కూడా ఏదో రకంగా కెసిఆర్‌ను ఉమ్మడి శతృవుగా భావిస్తున్నారు. తెలంగాణలో ముస్లింల సంఖ్య అధికం కనుక ఎన్నికలలో వారి మద్దతు తమకే లభిస్తుందని కాంగ్రెస్ పార్టీ నాయకులు అంచనా వేసుకుంటున్నారు. దీనికితోడు తెలంగాణలో ఒక వర్గం ప్రజలు అధికారమంతా కేసీఆర్ కుటుంబం వద్ద కేంద్రీకృతం కావడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. అదే సమయంలో కేసీఆర్, కేటీఆర్ వ్యవహార శైలి పట్ల పలువురు అసంతృప్తిగా ఉన్నారు. ప్రభుత్వం అమలుచేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు కాగితాలకే పరిమితమనీ, క్షేత్రస్థాయిలో వాటి అమలు అంతంత మాత్రమేనన్న విమర్శలు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో వచ్చే ఎన్నికలలో బీజేపీ తరఫున ఒక్క ఎమ్మెల్యే కూడా గెలిచే అవకాశం కనిపించడం లేదు. ఇకపోతే టిఆర్ఎస్కు కూడా పలు నియోజకవర్గాలలో
ఆ పార్టీ తరఫున ఇద్దరు నుంచి నలుగురు వరకు పోటీపడుతున్నారు. ప్రస్తుత శాసనసభ్యులలో అత్యధికులకు మళ్లీ టికెట్లు ఇస్తామని కేసీఆర్ అంటున్నా అందులో గెలిచే వారెవరు అన్న ప్రశ్న కూడా ఉంది. శాసనసభ్యులపై వ్యతిరేకత ఉండటంతో పాటు ఆశావహుల సంఖ్య అధికంగా ఉన్నందున విజయావకాశాలపై దాని ప్రభావం ఉంటుంది. ఒకప్పుడు కాంగ్రెస్ నియంతృత్వానికి వ్యతిరేకంగా సిద్ధాంతాలను పక్కనపెట్టి విపక్షాలన్నీ ఏకమయ్యాయి. ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ నియంతృత్వానికి వ్యతిరేకంగా అన్ని పార్టీలూ ఏకమయ్యే పరిస్థితులు ఏర్పడ్డాయి. రాష్ట్రంలో కూడా టిఆర్ఎస్ నియంతృత్వ ధోరణిపైనా ఉమ్మడి పోరు అవసరమని భావిస్తున్నారు. అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేక ¬దా ఇస్తామని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ప్రకటించారు. ఇది ఎపికి సానుకూలంగా ఉంది. దీంతో టిడిపి కాంగ్రెస్ పట్ సానుకూలతతో ఉంటోంది. తెలంగాణలో విధిలేని పరిస్థితులలో పార్టీని నమ్ముకుని ఉన్నవారి మనుగడ కోసం కాంగ్రెస్‌తో జత కట్టవలసిన పరిస్థితి ఉంది. ఈ విషయమై పార్టీ అధికారికంగా ఏ నిర్ణయం తీసుకోలేదు. కేంద్రంలో మళ్లీ నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయితే ఇబ్బంది పడవలసి వస్తుందన్న ఉద్దేశంతో జాతీయ రాజకీయాలలో పావులు కదిపే పనిలో చంద్రబాబు ఉన్నారు. అందుకే అవసరమైతే కాంగ్రెస్ సాయం తీసుకోవడంలో వెనకాడేందుకు సిద్దంగా లేరు. ముందుగా తెలంగాణలో శాసనసభకు మాత్రమే ముందస్తు ఎన్నికలు జరగనున్నందున కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుంటే దాని ప్రభావం ఆంధ్ర ప్రదేశ్‌లో ఎలా ఉంటుందన్న అంశంపై తెలుగుదేశం అంచనా వేసుకునే అవకాశం ఉంది. పొత్తుల విషయంలో గానీ, మరో విషయంలో గానీ తన అధికారానికి ప్రమాదం తెచ్చే ఏ నిర్ణయం కూడా చంద్రబాబు తీసుకోరు. అయితే మోడీని సాగనంపడానికి అవకాశాలను మాత్రం వినయోగించుకోవడం ఖాయంగా ఉంది.




