అగస్టాపై పార్లమెంటరీ కమిటీ

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 27 (జనంసాక్షి) :
అగస్టా హెలికాప్టర్‌ల కొనుగోలు కుంభకోణంపై దర్యాప్తు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం పార్లమెంటరీ కమిటీ(జేపీసీ) ఏర్పాటు చేసింది. ఈ మేరకు బుధవారం రాజ్యసభలో ఈ విషయంపై చర్చ జరిగింది. ఈ కుంభకోణంపై ప్రభుత్వం ఏడాదిగా ఎలాంటి దర్యాప్తు చేయకుండా ఉదాశీనంగా వ్యవహరించిందని ప్రతిపక్షాలు మండిపడ్డాయి. రక్షణ మంత్రి ఏకే ఆంటోని సమాధా నమిస్తూ ఈ కుంభకోణం మూ లాలను పట్టుకునేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కమల్‌నాథ్‌ జేపీసీ తీర్మానాన్ని చదివి వినిపించారు. ప్రతిపక్ష నాయకుడు, బీజేపీ సీనియర్‌ నేత అరుణ్‌జైట్లీ ఈ తీర్మానాన్ని వ్యతిరేకించారు. ఇది వృథా ప్రయత్నమని, ఈ విషయాన్ని పక్కకు మళ్లించేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నమని ఆరోపించారు. నిందితులను పట్టుకుని విచారిస్తేనే వాస్తవాలు బయటకొస్తాయని చెప్పారు. టీడీపీ, జేడీయూ, తృణమూల్‌ కాంగ్రెస్‌ కూడా ఈ తీర్మానాన్ని వ్యతిరేకించాయి. సీబీఐ చేస్తున్న దర్యాప్తునకు జేపీసీ పర్యవేక్షిస్తుందని, మొదటి సమావేశం జరిగిన మూడు నెలల్లోగా నివేదికను అందిస్తుందని కమల్‌నాధ్‌ చెప్పారు. ఎన్‌డీఏ కూటమి ఈ విషయాన్ని రాజకీయం చేయాలని చూడడం సరికాదన్నారు. 2జీ స్పక్ట్రమ్‌ విషయంలో జేపీసీ కోసం పార్లమెంట్‌ను స్తంభింపజేసిన ప్రతిపక్షాలు, ఈ షయంలో జేపీసీని వ్యతిరేకిస్తున్నాయని ఆరోపించారు. రాజ్యసభ ఉపాధ్యక్షుడు పీజే కురియన్‌ తీర్మానం ప్రవేశపెట్టినట్లేనంటూ మోజువాణి ఓటును తీసుకున్నారు. తర్వాత తీర్మానానికి ఆమోద ముద్ర పడిందంటూ ప్రకటించారు.