అగస్టా కుంభకోణంలో త్యాగిని ప్రశ్నించిన సీబీఐ

న్యూఢిల్లీ, మార్చి 6 (జనంసాక్షి):హెలికాప్టర్ల కుంభకోణంలో సీబీఐ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఆర్మ్స్‌గేట్‌ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ ఎస్‌పీ త్యాగిని బుధవారం విచారించింది. వీవీఐపీల కోసం అగస్టా వెస్ట్‌ల్యాండ్‌ హెలికాప్టర్ల కొనుగోలులో భారీ అక్రమాలు జరిగాయనే అభియోగాలపై సీబీఐ దర్యాప్తు చేపట్టింది. రూ.3,600 కోట్ల ఒప్పందంలో దాదాపు రూ.400 కోట్లు లంచాలిచ్చినట్లు ఇటీవల ఇటలీ అధికారుల దర్యాప్తులో వెలుగు చూసింది. దీనిపై కేంద్ర ప్రభుత్వం దర్యాప్తుకు ఆదేశించడంతో సీబీఐ రంగంలోకి దిగింది. ఇప్పటికే ఇటలీ వెళ్లి పలు ఆధారాలను సేకరించిన దర్యాప్తు అధికారులు.. బుధవారం త్యాగిని ప్రశ్నించారు. గురువారం కూడా విచారించినున్నట్లు సీబీఐ వర్గాలు వెల్లడించాయి. మరోవైపు, ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న త్యాగి బంధువు జూలీ, డోక్సా త్యాగీలను కూడా ప్రశ్నించారు. కుంభకోణంతో సంబంధం ఉందని భావిస్తున్న ఏరోమాట్రిక్స్‌ సీఈఓ ప్రవీన్‌ భక్షిని మంగళవారం విచారించారు.