అగ్నిపథ్ నిర్ణయం వెనక్కి తీసుకోవాలి

– విద్యా,వైద్యాన్ని మరిచిన ప్రభుత్వాలు
– నాటు వేసి ఆశీస్సులు పొంది
– నియోజకవర్గ నేత నెహ్రూ నయక్

డోర్నకల్ ఆగస్టు 13 జనం సాక్షి

కేంద్రం తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకం రాబోయే రోజుల్లో కొత్త సమస్యలకు ఆజ్యం పోస్తుందని కాంగ్రెస్ నియోజకవర్గం నేత నెహ్రూ నాయక్ ఆరోపించారు.దేశానికి స్వతంత్రం సిద్ధించి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు నియోజకవర్గ వ్యాప్త పాదయాత్రను మొదలుపెట్టారు.డోర్నకల్,కొరవి మండలాల్లో శనివారం పాదయాత్ర సాగింది.మార్గమధ్యంలో మహిళా వ్యవసాయ కూలీలతో కలిసి నాటు వేసి మద్దతు కూడగట్టారు.ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ…75 ఏళ్ల స్వతంత్ర దేశంలో కాంగ్రెస్ పార్టీ దేశ నిర్మాణానికి చేసిన త్యాగాలు నేటి తరానికి గుర్తు చేస్తూ ప్రస్తుతం కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా నియోజకవర్గ వ్యాప్త పాదయాత్ర చేపట్టినట్లు తెలిపారు.ఇటీవల కేంద్రం ప్రభుత్వం తీసుకువచ్చిన అగ్నిపథ్ పథకాన్ని వివిధ శాఖలో అమలు చేయాలని యోచిస్తుందని అన్నారు. స్వయం ప్రతిపత్తి సంస్థలను తన గుప్పిట్లో పెట్టుకొని సమస్యలు సృష్టించి లబ్ది పొందడమే బిజెపి లక్ష్యంగా పెట్టుకుందని ఆయన ఆరోపించారు.నాటి ప్రధాని నెహ్రూ భవిష్యత్ తరాలకు విద్యా,వైద్యం,టెక్నాలజీ అందించుటకు దృష్టి సారించి ఆదిశగా కృషి చేశారన్నారు.నేడు పౌరులు టెక్నాలజీలో ప్రపంచంతో పోటీపడుతున్న తరుణంలో నేటి ప్రధాని చప్పట్లు కొట్టండి,దీపాలు ఆర్పండి అనే నిర్ణయాలతో దేశాన్ని వెనక్కి నడిపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలతో రాష్ట్రం అప్పుల కుప్పగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు.యువత దేశ,రాష్ట్ర అభివృద్ధికై రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చారు.అంతకుముందు పట్టణంలోని మహాత్మా గాంధీ,ఇందిరాగాంధీ విగ్రహాలకు పూలమాలలు వేసి పాదయాత్ర ప్రారంభించారు.పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు.కార్యక్రమంలో కౌన్సిలర్ శీలం భాగ్యలక్ష్మి శ్రీనివాస్,మండల నాయకులు బికిన నాయక్,జగదీష్,దేవ్ సింగ్,హరికృష్ణ,అనిల్,
లాలు నాయక్,బావు సింగ్,ఉపేందర్ గౌడ్,విజయ్,
సోషల్ మీడియా మోహన్,శంకర్ తదితరులు పాల్గొన్నారు.