అచింత షూలి బంగారు పతకం సొంతం
బర్మింగ్‌హామ్: కామన్వెల్త్ గేమ్స్‌లో భారత వెయిట్ లిఫ్టర్ల జోరు కొనసాగుతున్నది. వెయిట్ లిఫ్టర్లు మరో స్వర్ణాన్ని భారత్ ఖాతాలో వేశారు. పురుషుల 73 కేజీల విభాగంలో 20 ఏండ్ల అచింత షూలి (Achinta Sheuli) బంగారు పతకం సొంతం చేసుకున్నాడు. దీంతో భారత్ పతకాల సంఖ్య ఆరుకు చేరింది. స్నాచ్ తొలి ప్రయత్నంలోనే 137 కేజీల బరువు లిఫ్ట్ చేసిన బెంగాల్ లిఫ్టర్ అచింత.. తర్వాతి ప్రయత్నంలో 140 కేజీలు, మూడో ప్రయత్నంలో 143 ఎత్తి అగ్రస్థానంలో నిలిచాడు.
క్లీన్ అండ్ జెర్క్‌లోనూ తొలి ప్రయత్నంలో 166 కేజీలు ఎత్తిన అచింత.. రెండో లిఫ్ట్‌లో 170 కేజీలు ఎత్తడంలో విఫలమయ్యాడు. అయితే మూడో ప్రయత్నంలో 170 కేజీలు ఎత్తి స్వర్ణ పతకం సాధించాడు. మొత్తంగా 313 కేజీలతో (143 కేజీ+170 కేజీ) క్రీడల రికార్డు నెలకొల్పాడు. మలేషియాకు చెందిన హిదాయత్ ముహమ్మద్ సిల్వర్ (303 కేజీలు), కెనడాకు చెందిన షాద్ దర్సిగ్నే బ్రోన్జ్ మెడల్ (298 కేజీలు) సాధించారు.
దీంతో కామన్‌వెల్త్ గేమ్స్‌లో భారత్ ఇప్పటివరకు సాధించిన ఆరు పతకాలు వెయిట్ లిఫ్టింగ్ విభాగంలోనే కావడం విశేషం. ఇందులో మూడు స్వర్ణాలు, రెడు రజతాలు, ఒక కాంస్య పతకం ఉన్నాయి. శనివారం పోటీల్లో మూడు పతకాలు సాధించిన లిఫ్టర్లు.. ఆదివారం పురుషుల 67 కేజీల విభాగంలో జెరెమీ లాల్‌రినుంగా పసిడి పతకం కైవసం చేసుకోగా.. మహిళల 55 కేజీల విభాగంలో బింద్యారాణి రజతం చేజిక్కించుకుంది. కాగా, గోల్డ్ మెడల్ సాధించిన హవిల్దార్ అచింత షూలికి ఇండియన్ ఆర్మీ శుభాభినందనలు తెలిపింది.