అటవీ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర-కేంద్రమంత్రి కిశోర్ చంద్రదేవ్ వెల్లడి
న్యూఢిల్లీ: చిన్న తరహా అటవీ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర కల్పించడానికి ప్రత్యేక కమిషన్‌ను ఏర్పాటు చేయబోతున్నట్లు కేంద్రమంత్రి కిశోర్‌చంద్రదేవ్ ప్రకటించారు. కేంద్ర గిరిజన వ్యవహారాలు, పంచాయితీరాజ్ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించి ఏడాదైన సందర్భంగా ఆయన గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ధరల నిర్ణాయక సంఘం 2013జనవరి 1వ తేది నుంచి అమల్లోకి వస్తుందన్నారు. చిన్నతరహా అటవీ ఉత్పత్తులపై ఆధారపడి జీవించే గిరిజనుల ఆదాయాన్ని పెంచి వారి జీవన ప్రమాణాలను మెరుగు పరచడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. తేనె, చింతపండు, వెదురు, తెండు ఆకులు, జిగురు వంటి మొత్తం 13ఉత్పత్తులకు కనీస మద్దతు ధరను వర్తింప చేస్తామన్నారు. ప్రస్తుతం చింతపండు ధర మార్కెట్లో కిలోకు 80రూపాయలు పలుకుతుంటే చట్టబద్ధమైన కనీస మద్దతు ధర కల్పిస్తే గిరిజనులకు మేలు జరుగుతుందన్నారు. రాష్ట్రస్థాయిలో అటవీ ఉత్పత్తుల కనీస మద్దతు ధరను అమలు చేయడానికి గిరిజన మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో ఒక నోడల్ ఏజెన్సీని ఏర్పాటు చేస్తామని మంత్రి చెప్పారు.