అటే సుందరానికి ..ఓటిటిలో మంచి రెస్పాన్స్
నేచురల్ స్టార్ నానీ మలయాళ బ్యూటీ నజ్రియా ఫహద్ జోడీగా.. వివేక్ ఆత్రేయ మలిచిన రొమాంటిక్ కామెడీ చిత్రం ’అంటే సుందరానికీ’ జూన్ 10న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్‌లో విడుదలైంది. చిత్రానికి మిశ్రమ స్పందన లభించింది. నదియా, నిక్కీ తంబోలి, పృధ్విరాజ్, అనుపమా పరమేశ్వరన్, నరేశ్, శ్రీకాంత్ అయ్యంగార్, హర్షవర్దన్ తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. ఒక సదాచార బ్రాహ్మణ యువకుడు, ఒక క్రిస్టియన్ ఆర్దోడక్స్ ఫ్యామిలీకి చెందిన అమ్మాయిల మధ్య చిగురించిన ప్రేమ.. ఎలాంటి పరిస్థితులకు దారితీసింది? ఇంట్లోవారికి తెలియకుండా ఆ ఇద్దరూ ఎలా మేనేజ్ చేశారు? చివరికి ఇంట్లో వారికి తెలిసిపోతే అప్పుడు కూడా వారు ఆ వ్యవహారాన్ని ఎలా కవర్ చేశారు? అన్నదే ఈ సినిమా మిగతా కథ. నానీ అద్భుత కామెడీ టైమింగ్, నజ్రియా సహజ నటన ఈ సినిమాకి హైలైట్స్.థియేటర్స్‌లో ఈ సినిమాకు ఏమంతగా ఆదరణ దక్కలేదు. వసూళ్ళ విషయంలోనూ అంతగా మ్యాజిక్ చేయలేక పోయింది. అయినప్పటికీ.. ఇటీవల నెట్‌ప్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ ప్రారంభించిన ఈ సినిమాకి అద్బుతమైన రెస్పాన్స్ రావడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇటీవల నెట్‌ప్లిక్స్‌లో టాప్ 10 మూవీస్‌లో ’అంటే సుందరానికి’ చిత్రం నెం.1 పొజీషన్‌లో నిలవడం విశేషంగా మారింది. ఇదే లిస్ట్ లో ఈ సినిమా తమిళ
వెర్షన్ 6వ స్థానంలో నిలిచింది. కరోనా తర్వాత థియేటర్స్‌కు రావడం తగ్గించేసిన ప్రేక్షకులు.. ఇలాంటి కామెడీ చిత్రాల్ని కుటుంబ సమేతంగా ఓటీటీలోనే చూసి ఆస్వాదించాలనుకుంటున్నారు. అందులో భాగంగానే ఈ సినిమాకి థియేటర్స్‌లో ఆదరణ కరువైందని కొందరు విశ్లేషిస్తున్నారు. ఈ సినిమా ఓటీటీలో అద్భుత స్పందన తెచ్చుకోవడంతో నిర్మాతలు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.ప్రస్తుతం కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ’దసరా అనే మాస్ యాక్షన్ చిత్రంలో నటిస్తున్నాడు నానీ. కీర్తి సురేశ్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమా సింగరేణి బొగ్గుగనుల నేపథ్యంలో ఆసక్తికరమైన కథాకథనాలతో రూపొందుతోంది. ’దసరా’ చిత్రంలో దానికి పూర్తి వ్యతిరేకంగా రఫ్ అండ్ టఫ్ కేరక్టర్‌ను చేయనుండడం విశేషం. ఇందులో నానీ మేకోవర్.. ’పుష్ప’ మూవీలో అల్లు అర్జున్ ను పోలి ఉండడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.