అడుగడుగునా అపాయం.
వ్యవసాయ పనుల్లో జాగ్రత్తలు తీసుకోవాలి .
కరకగూడెం, జులై06(జనంసాక్షి): పంటలను కాపాడుకునేందుకు రైతులు ఎంతలా శ్రమిస్తారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రాత్రనక పగలనక పంటను పసి పాపల కాపాడుకుంటారు. నిత్యం చేలల్లో ఉండే రైతులకు ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకోస్తుందో చెప్పలేం, వ్యవసాయ పనుల్లో నిమగ్నమైన రైతులకు వ్యవసాయ కూలీలకు అనుకోకుండా సంభవించే ప్రకృతి వైపరీత్యాలు, పంట పొలాల్లో ఉండే విద్యుత్ మరమ్మతు పనులు, మందుల పిచికారీ పనులతో, క్రిమికీటకాలతో ఒక్కోసారి ప్రమాదాలకు గురవుతుంటారు. అయితే అన్నదాత అప్రమత్తంగా ఉండి కొన్ని జాగ్రత్తలు పాటిస్తే ప్రమాదాలను అధిగమించవచ్చని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు.
– విషపురుగుల పట్ల జాగ్రత్త
పొలాల్లో పచ్చికబయళ్లు పెరగడంతో ఎక్కడ ఏ విష పురుగు ఉందో గుర్తు పట్టడం కష్టం ఉంటుంది. పాములు, తేళ్లు, ఇతర విష కీటకాలతో అపాయం వెంటే ఉంటుంది. దీంతో ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా సమస్యలో పడ్డట్టే, అందుకే ఎప్పటికప్పుడు గట్లు శుభ్రం చేయడం, మోకాలి వరకు బూట్లు,తొడుగులు ధరించడం, దారిలో కర్రసాయంతో శబ్దం చేస్తూ ముందుకు సాగడం వంటి జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా ఎలుకల నివారణకు చర్యలు చేపడితే దాదాపు పాముల బెడద తగ్గుతుందని గమనించాలి.
ఒకవేళ కాటుకు గురైతే అది విషపూరితమైనదా? లేదా? అని గుర్తించడం చాలా అవసరం. వెంటనే కాటేసిన పైభాగంలో బట్టతో లేదా టవల్‌తో గట్టిగా కట్టాలి. ఇలా చేయడం వల్ల విషం శరీరంలోకి వ్యాపించదు. సాధ్యమైనంత తొందరగా సమీపంలోని ఆసుపత్రికి తీసుకువెళితే వైద్యుడి స్నేక్ వినమ్ తీసుకుంటే ప్రాణాపాయం ఉండదు. రాత్రి వేళల్లో పొలం వద్దకు వెళ్లే రైతులు శబ్దం చేస్తూ టార్చ్‌లైట్ వెంట తీసుకెళ్లాలి.
– పిడుగు పాటు
వాతావరణంలో మార్పులతో గత నాలుగేళ్లుగా పిడుగుపాటు ఘటనలు ఎక్కువగా చోటుచేసుకుంటున్నాయి. 2019లో అత్యధిక మరణాలు సంభవించాయి. గాలితో పాటు ఉరుములు, మెరుపులతో వర్షం కురిసేటప్పుడు తాటి, కొబ్బరి వంటి పొడవాటి చెట్లపైన పిడుగులు పడే అవకాశాలెక్కువ. వాటికి దూరంగా ఉండటం మంచిది. ఎత్తైన చెట్ల కిందకు వెళ్లిన వారే ఎక్కువగా ప్రమాదాలకు గురయ్యారు. సాధ్యమైనంత వరకు పనులు ముగించుకుని ఇళ్లకు చేరుకోవడం ఉత్తమం.
– విద్యుత్ తో అపాయం
వ్యవసాయ అవసరాలకు ఏర్పాటు చేసిన విద్యుత్తు నియంత్రికలు, తీగలు, రక్షణ కంచెల బారినపడి ఏటా పలువురు మృతిచెందుతున్నారు. కాబట్టి వ్యవసాయ బావుల వద్దనున్న స్టాటర్ల డబ్బాలకు ఎర్తింగ్ చేయించుకోవాలి. ఇనుము కాకుండా ప్లాస్టిక్ డబ్బాలను ఏర్పాటు చేసుకుంటే మంచిది. నియంత్రిక వద్ద ఫ్యూజు పోయిన సందర్భంలో రైతులే చర్యలకు ఉపక్రమించకుండా విద్యుత్తు శాఖ అధికారులకు సమాచారమివ్వాలి. తీగలు కిందకు వేలాడుతున్నా, తెగిపడినా సమాచారం అందిస్తే వెంటనే చర్యలు తీసుకుంటారని, సొంత మరమ్మతులు చేసి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని విద్యుత్ అధికారులు తెలిపారు.
– పురుగు మందుల పట్ల జాగ్రత్త వహించాలి
వాణిజ్య పంటల పైర్లతో పాటు వరి పొలాలను తెగుళ్లను ఆశించే సమయమిది. పంట పొలాల్లో మందులు పిచికారీ చేసే సమయాల్లో రైతులు సరైన జాగ్రత్తలు పాటించకపోవడం వల్ల తరచూ ప్రమాదాల భారిన పడుతుంటారు. ఎరువులు, క్రిమి సంహారక మందులు పిచికారీ చేసేటప్పుటు అజాగ్రత్తగా ఉండడం వల్ల రైతులు అస్వస్థతకు గురై ప్రాణాలకే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంటుంది. పురుగు మందుల పిచికారీ చేసేటప్పుడు చేతులకు గ్లౌస్లు, ముక్కుకు గుడ్డలను ధరించాలి.
పిచికారీ మందులను గ్లౌవ్స్ వేసుకున్న చేతితో లేదా కర్ర సహాయంతో కలుపుకోవాలి. ఎరుపు రంగు హెచ్చరిక ఉండే మిశ్రమాల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. పురుగు మందులు ఎరువులు మందులు పిచికారీ చల్లడం అయిపోయిన వెంటనే చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి. ఇంటికి వెళ్లగానే స్నానం చేసిన తర్వాతే భోజనం చేయాలి.
|