అణగారిన బాలల వసతి గృహం ప్రారంభం
విజయనగరం, జూలై 16 : జిల్లాలో అనాదరణకు గురై నిరాధారంగా తిరుగుతున్న బాలల కోసం ప్రభుత్వం ఓ ప్రత్యేక వసతి గృహాన్ని సోమవారం ఇక్కడ ప్రారంభించింది. దీనిని విజయనగరం పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ బొత్స ఝన్సీలక్ష్మి, కలెక్టర్ వీరబ్రహ్మయ్య ప్రారంభించారు. అంతేకాకుండా మున్సిపల్ హైస్కూల్‌కు అనుబంధంగా పది గదులతో నిర్మించిన భవనాన్ని కూడా కంటోన్మెంట్లో వీరు ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో అనాథలైన బాలలకు ఈ వసతిగృహంలో భోజన, వసతి సదుపాయం కల్పించి, విద్యాబుద్ధులు చెప్పిస్తామని తెలిపారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సుబ్బారావు, తదితరులు పాల్గొన్నారు. కాగా అంతకుముందు 16.50 లక్షల వ్యయంతో కొనుగోలు చేసిన రెండు మంచినీటి ట్యాంకర్లను కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు.