అణిచివేత నుంచి తిరుగుబాటు తప్పదు
– ప్రొఫెసర్ హరగోపాల్
హైదరాబాద్,జులై 4(జనంసాక్షి): అణచివేత, విధ్వంసం నుంచే తిరుగుబాటు వస్తుందనే విషయం పాలకులకు తెలియకపోవటం బాధాకరమని ప్రొఫెసర్ హరగోపాల్ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం విద్యార్ధి సంఘాలపై కొనసాగిస్తున్న నిర్బంధం తగని చర్య అన్నారు. సోమవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో విద్యార్ధి జేఏసీ, ఓయూ జేఏసీ ఆధ్వర్యంలో విద్యార్ధి ఉద్యమంపై నిర్భందానికి వ్యతిరేకంగా నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాలొని మాట్లాడారు. ఏ ఉద్యమ స్ఫూర్తితో, ప్రజాస్వామ్య బద్ధంగా తెలంగాణను సాధించుకున్నారో ఇప్పుడు దానికి వ్యతిరేకంగా ప్రభుత్వం విద్యార్థులపై ఆంక్షలు పెట్టటం దేనికి సంకేతమని ఆయన ప్రశ్నించారు. ప్రజలకు మాట్లాడుకునే స్వేచ్ఛను ఇవ్వకుంటే ఇదేమి ప్రజాస్వామ్యమని విమర్శించారు. పాలకులు హద్దులు విూరి ప్రవర్తిస్తే దాని పర్యవసానం తీవ్రంగా ఉంటుందని హెచ్చరించారు. ఏబీవీపీ సహా అన్ని విద్యార్థి సంఘాలు ఏకమై ప్రజాస్వామ్య విలువలను కాపాడుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.